ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వన్డేలో ఒకటి, టీ20లో మరొకటి... దేశానికి రెండు వరల్డ్ కప్స్ తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఓ ఐసీసీ ట్రోఫీ, మూడు ఏషియన్ కప్స్ తెచ్చారు. ఇప్పుడు ఎంఎస్ ధోని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించిన ఆయన... ఓ సినిమా నిర్మించారు. అది తెలుగులోనూ విడుదల కానుంది. 


తెలుగులోనూ 'ఎల్‌జిఎమ్' విడుదల
ఎంఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీద రూపొందిన మొదటి సినిమా 'ఎల్‌జిఎమ్' (LGM Movie). అంటే... లెట్స్ గెట్ మ్యారీడ్ (పెళ్లి చేసుకుందాం) అని అర్థం. త‌మిళంలో రూపొందిన చిత్రమిది. దీనిని తెలుగులోనూ (LGM Release In Telugu) విడుద‌ల చేస్తున్నారు. 


సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా 'ఎల్‌జిఎమ్' అని యూనిట్ చెబుతోంది. ఈ చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ధోనీ సతీమణి సాక్షి ధోని నిర్మించారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 


త్వరలో ట్రైలర్... తర్వాత పాటలు!
అతి త్వర‌లోనే హైదరాబాద్ సిటీలో 'ఎల్‌జిఎమ్' ట్రైల‌ర్‌, ఆ తర్వాత పాటల్ని విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. ఆ కార్య‌క్ర‌మంలో మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని దంపతులతో పాటు చిత్ర బృంద సభ్యులు కూడా పాల్గొన‌నున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలైంది. దానికి 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 


'ఎల్‌జిఎమ్' సినిమాలో హరీష్ కళ్యాణ్ కథానాయకుడు. ఆయనకు జోడీగా 'లవ్ టుడే' ఫేమ్ ఇవనా కథానాయికగా నటించారు. తెలుగులో 'మిర్చి', 'అత్తారింటికి దారేది' సహా అనేక సినిమాల్లో నటించిన నదియా, హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్ చూస్తే... దర్శకుడు వెంకట్ ప్రభు ఓ పాత్రలో కనిపించారు. ధోని సినిమా కావడంతో 'ఎల్‌జిఎమ్' మీద తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. 


Also Read 'సలార్' మీద భారం వేసిన ప్రభాస్ ఫ్యాన్స్ - అంతా 'ఆదిపురుష్' వల్లే


'ఎల్‌జిఎమ్' ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ''కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామా ఇది. సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తూనే గుండెల‌ను తాకుతాయి. తెలుగు ప్రేక్ష‌కులు కూడా త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ మా సినిమాకు అందిస్తార‌ని భావిస్తున్నాం'' అని అన్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా ఆయనే.


Also Read : భయంకరమైన నెగిటివిటీ ఉన్నా భారీ కలెక్షన్స్ - మొదటి రోజు అదరగొట్టిన 'ఆదిపురుష్'



యోగిబాబును సర్ ప్రైజ్ చేసిన ధోనీ
'ఎల్‌జిఎమ్'లో నటించిన కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబును కొన్ని రోజుల క్రితం ధోనీ సర్‌ప్రైజ్ చేశారు. తాను సంతకం చేసిన బ్యాట్ అతనికి పంపించారు. ఆ బ్యాట్ పట్టుకుని దిగిన ఫొటోలను యోగిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమాల్లో యోగి బాబు బిజీ ఆర్టిస్ట్. అయితే... ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటారు. మూవీ లొకేషన్లలోనూ అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకుని దర్శనమిస్తుంటారు. యోగి క్రికెట్ ఆడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి.