One Year of Virataparvam : 'విరాట పర్వం' విడుదలై ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకుంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నందితా దాస్, ప్రియమణి నటించిన పాత్రలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 17, 2022న థియేటర్లలో విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల్లో కొందరి ప్రశంసలు అందుకుంది. "నీ రాతలో నేను లేకపోవచ్చు. కానీ, నీ తల రాతలోమాత్రం ఖచ్చితంగా నేనే ఉన్నాను" అంటూ సాయి పల్లవి చేప్పే డైలాగ్ కూడా చాలా హిట్ అయిన విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


'విరాట పర్వం' విడుదలై ఈ రోజుతో ఏడాది పూర్తి అయ్యింది. వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఇంట్రస్టింగ్ నోట్ ను రాసుకొచ్చారు. "విరాట పర్వానికి ముందు ఉన్న 'నేను' దాని విడుదల తర్వాత ఉన్న 'నేను' ఒకటి మాత్రం కాదు" అంటూ వేణు... తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 


"విరాట పర్వం విడుదలై ఈ రోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న 'నేను' దాని విడుదల తర్వాత ఉన్న 'నేను' ఒకటి మాత్రం కాదు. విరాట పర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలల పాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాట పర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరీ (Self discovery) లాంటిది. తీయబోయే చిత్రాలకు ఇదొక ఉపోద్ఘాతం (Preamble) లాంటిది. విరాట పర్వం అనే ప్రయాణం మొదలెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు, ఇక ముందు ఈ అనుభవంలో భాగమైన నా ప్రేక్షకులకు , తూము సరళక్క కుటుంబ సభ్యులకు, సినిమాలో నటించిన నటీనటులకు, నా డైరెక్షన్ టీమ్ కి, రైటింగ్ టీమ్ కి, మీడియా మిత్రులకు, విమర్శకులకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. ముఖ్యంగా నా నిర్మాతలు సుధాకర్ చెరుకూరి సర్, శ్రీకాంత్ చుండి, సురేష్ బాబు సర్, రానా దగ్గుబాటి, సాయి పల్లవిలకు ప్రత్యేక కృతఙ్ఞతలు" అంటూ డైరెక్టర్ వేణు ఊడుగుల పోస్టులో రాసుకొచ్చారు. దాంతో పాటు వన్ ఇయర్ ఆఫ్ విరాటపర్వం (One Year of Virataparvam) అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు.


Also Read : 'సలార్' మీద భారం వేసిన ప్రభాస్ ఫ్యాన్స్ - అంతా 'ఆదిపురుష్' వల్లే






హృదయాన్ని హత్తుకునే పోస్ట్ చేసిన వేణు ఊడుగుల.. సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను గుర్తు చేసే ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. మూవీ చివర్లో రానా, సాయి పల్లవని షూట్ చేయడంతో.. ఆమె జలపాతంలోకి పడిపోయే సీన్ లోని ఈ ఫొటో మరోసారి వైరల్ అవుతోంది. 


Read Also : kangana Ranaut On Marriage : పెళ్లంటే ఇష్టం లేదు కానీ టైమ్ వచ్చినప్పుడు అవుతుంది, పిల్లల్నీ కంటా - కంగనా రనౌత్