పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు 'సలార్' (Salaar Movie) కోసం ఎదురు చూస్తున్నారు. 'ఆదిపురుష్' విడుదలై ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే తర్వాత సినిమా కోసం ఎదురు చూపులు మొదలు అయ్యాయి. దీనికి కారణం కూడా 'ఆదిపురుష్' అని చెప్పక తప్పదు.


'ఆదిపురుష్' ఎంత మందికి నచ్చింది? విమర్శకులు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో జనాల టాక్ ఏంటి? వంటివి పక్కన పెడితే... మొదటి రోజు సినిమా భారీ వసూళ్ళు సాధించింది. బాక్సాఫీస్ బరిలో వంద కోట్లకు పైగా రాబట్టింది. అయినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. దానికి కారణం 'ఆదిపురుష్'లో ప్రభాస్ కనిపించిన తీరు.


మాస్ యాక్షన్ కోసం వెయిటింగ్!
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీశారు. అందులో రాఘవ / శ్రీ రామ చంద్ర మూర్తి పాత్రలో ప్రభాస్ కనిపించారు. ఆ పాత్రకు కొన్ని పరిమితులు ఉన్నాయి. శ్రీ రాముడు మర్యాదా పురుషోత్తముడు కాబట్టి  పాత్ర చిత్రణ చాలా సౌమ్యంగా ఉంది. ఆ విధంగానే చూపించారు. యుద్ధ సన్నివేశాలు, హీరోయిజం చూపించే సీన్లు కొన్ని ఉన్నప్పటికీ... అభిమానులకు అవి సరిపోలేదు. అందుకని, ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పైగా, 'సలార్' కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, విడుదలకు మరో మూడు నెలలే ఉండటంతో ఆ సినిమా సందడి మొదలైంది. 


'సలార్' మీద భారం వేసిన ఫ్యాన్స్!
'ఆదిపురుష్' వసూళ్ళ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ రెబల్ స్టార్ అభిమానులను కొంచెం కలవరపెట్టింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకుడిపై అభిమానులు దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతి ప్రేక్షకుడికి తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. అందరి నుంచి ప్రశంసలు అందుకునే ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.


Also Read 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?  


'కెజియఫ్', 'కెజియఫ్ 2' సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైల్ ఏంటి? అనేది ప్రేక్షకులు అందరికీ ఐడియా వచ్చింది. ప్రభాస్ (Prabhas)ను ఆయన మాంచి మాస్ యాక్షన్ హీరోగా చూపిస్తారని, ఆ సినిమా అందరికీ నచ్చుతుందని రెబల్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'సలార్'తో విమర్శకులకు చెక్ పెడతామని, ఆ సినిమా మీద భారం వేశారు.   


సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల
Salaar Movie Release Date : సెప్టెంబర్ 28న 'సలార్' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత.  


'సలార్' కాకుండా ప్రభాస్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సినిమా, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' కూడా ఆయన చేస్తున్నారు.  


Also Read ఆ ఆరులో మూడు ప్రభాస్ సినిమాలే - 'ఆదిపురుష్' ఫస్ట్ డే కలెక్షన్లతో రికార్డ్