మేకప్ ఆర్టిస్ట్ మీద చిరుత పులి దాడి చేసింది. ముంబైలో జరిగిన ఈ ఘటన హిందీ చిత్రసీమలో కలకలం సృష్టించింది. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేసే వరకు వెళ్ళింది. అసలు వివరాల్లోకి వెళితే...


అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కథానాయకులుగా నటిస్తున్న హిందీ సినిమా 'బడే మియా ఛోటే మియా' (Bade Miyan Chote Miyan 2023 Movie). ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడ మేకప్ ఆర్టిస్ట్ మీద చిరుత దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. 


చిరుతను ఢీ కొట్టిన బండి
'బడే మియా ఛోటే మియా' చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ పని చేస్తున్నారు. అతని స్నేహితుడు ఒకరు షూటింగుకు వచ్చారు. లొకేషన్‌కి సమీపంలో, చాలా దగ్గరగా ఉన్న ఓ ప్రాంతంలో స్నేహితుడిని డ్రాప్ చేయడానికి బైక్ మీద శ్రవణ్ విశ్వకర్మ వెళ్ళారు. తిరిగి వస్తుండగా... రోడ్డుకు అడ్డంగా పంది పరిగెడుతూ వచ్చింది.  దాంతో శ్రవణ్ బండి స్పీడు పెంచాడు. పంది వెనుక వచ్చిన చిరుతను ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతనిపై ఆ చిరుత దాడి చేసింది. 


శ్రవణ్ చుట్టూ తిరిగిన చిరుత
ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో శ్రవణ్ విశ్వకర్మ చికిత్స పొందుతున్నాడు. ఓ మీడియా సంస్థతో తనపై చిరుత దాడి గురించి శ్రవణ్ మాట్లాడారు. ''చిరుతను ఢీ కొట్టిన తర్వాత నేను బండి మీద నుంచి కిందకు పడ్డాను. ఆ తర్వాత నా చుట్టూ చిరుత తిరగడం గుర్తు ఉంది. ఇంకేమీ గుర్తు లేదు. నేను స్పృహ కోల్పోయాను. చిరుత నాపై దాడి చేసిన తర్వాత ఎవరైనా వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకు వచ్చి ఉంటారు'' అని శ్రవణ్ విశ్వకర్మ పేర్కొన్నారు.


శ్రవణ్ విశ్వకర్మ చికిత్సకు అయ్యే ఖర్చును అంతా 'బడే మియా ఛోటే మియా' చిత్ర నిర్మాణ సంస్థలు భరిస్తున్నాయి. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', 'టైగర్ జిందా హై', 'భారత్' ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా ఎంటర్టైన్మెంట్, ఆజ్ ఫిలిమ్స్ సంస్థలపై వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, జాకీ భగ్నానీ, హిమాంశు కిషన్ మెహ్రా, ఆలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదల కానుంది. 


చిరుతలు వస్తున్నాయ్...
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి!
మేకప్ ఆర్టిస్ శ్రవణ్ విశ్వకర్మ మీద చిరుత దాడి చేసిన ఘటన మీద ఆల్ ఇండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్ లాల్ గుప్తా స్పందించారు. ఇటువంటి ఘటనలు ముంబై ఫిల్మ్ సిటీలో చాలా చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సామాజిక మాధ్యమాలలో ట్యాగ్ చేసి సమస్యను సీయం దృష్టికి తీసుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. 


Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?


వందల ఎకరాల్లో నిర్మించిన ఫిల్మ్ సిటీలో రాత్రిపూట కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా ఉండటం లేదని, చిరుతలు పదే పదే రోడ్ల మీదకు వస్తున్నాయని, అందువల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సురేష్ శ్యామ్ లాల్ గుప్తా పేర్కొన్నారు. చిరుతల నుంచి సినీ కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


Also Read : స్క్రిప్ట్‌ చదువుతూ చాలాసార్లు ఏడ్చాను - ‘RSS’ స్టోరీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!