రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. భారతీయ సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. రూ.1200 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ చిత్రం, ఆస్కార్ అవార్డును అందుకునేందుకు సిద్ధం అయ్యింది. ఈ అద్భుత చిత్రానికి కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి. ప్రస్తుతం ఆయన RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కు సంబంధించి ఓ సినిమా కోసం పని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

   


స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను- రాజమౌళి


ఆర్ఎస్ఎస్ సినిమా కథ మీకు ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురైనప్పుడు రాజమౌళి కీలక విషయాలు చెప్పారు. నిజం చెప్పాలంటే తనకు RSS చరిత్ర గురించి తెలియదన్నారు. "నాకు,  ఆర్‌ఎస్‌ఎస్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ సంస్థ గురించి నేను విన్నాను.  కానీ, అది ఎలా ఏర్పడింది? వారి కచ్చితమైన లక్ష్యాలు ఏంటి? ఆ సంస్థ ఎలా అభివృద్ధి చెందింది? అనే విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ, నేను మా నాన్న గారి స్క్రిప్ట్‌ని చదివాను. అది చాలా ఎమోషనల్‌గా ఉంది. ఆ స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏడ్చాను. స్క్రిప్ట్‌ లోని డ్రామా నన్ను కంటతడి పెట్టేలా చేసింది. కానీ, ఆ రియాక్షన్‌కి కథలోని హిస్టరీ పార్ట్‌ తో సంబంధం లేదు" అన్నారు.


నేను దర్శకత్వం వహిస్తానో? లేదో? తెలియదు- రాజమౌళి


అటు ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తానో? లేదో? తెలియదన్నారు. "నేను చదివిన స్క్రిప్ట్ చాలా ఎమోషనల్ గా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. కానీ, అది సమాజం గురించి ఏమి సూచిస్తుందో నాకు తెలియదు.  మా నాన్న రాసిన స్క్రిప్ట్‌ కి నేను దర్శకత్వం వహిస్తానా? అని మీరు అడుగుతారు అని భావిస్తున్నాను. అది తనకు తెలియదు. సాధ్యం అవుతుందో? లేదో? కూడా నాకు తెలియదు. ఎందుకంటే, మా నాన్న ఈ స్క్రిప్ట్‌ ను ఏ సంస్థ కోసం, ఏ వ్యక్తి కోసం, లేదంటే ఓ నిర్మాత కోసం రాశారో? నా దగ్గర కచ్చితమైన సమాచారం లేదు.  అయితే, తను రాసిన కథకు దర్శకత్వం వహించడం నాకు గౌరవంగా ఉంటుంది.  ఎందుకంటే, ఇది చాలా అందమైన, మానవీయ, భావోద్వేగ పూరితమైన డ్రామాగా ఉంది” అని రాజమౌళి వెల్లడించారు.


విజయేంద్ర ప్రసాద్ గురించి..


విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ తెలుగు సినీ రచయిత. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుత విజయాలు అందుకు పలు సినిమాలకు ఆయన కథలను అందించారు. హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ కొన్ని చిత్రాలకు స్క్రిప్ట్‌  రాశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’, ‘మగధీర’, ‘మెర్సల్’ లాంటి సినిమాలకు ఆయన కథ అందించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజన్న’ చిత్రానికి గానూ ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నారు.


Read Also:  ‘కాంతార’ కేసులో మలయాళ హీరో పృథ్వీరాజ్‌కు ఊరట - స్టే విధించిన కేరళ హైకోర్ట్