దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది ‘కాంతార’ సినిమా. చిన్న సినిమాగా విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. తొలుత కన్నడలో విడుదలైన ఈ మూవీ, అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో దేశ వ్యాప్తంగా పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా అద్భుత విజయాన్ని అందుకుంది.  రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.


పృథ్వీరాజ్ కేసుపై స్టే విధించిన కేరళ హైకోర్టు


‘కాంతార’ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు అదే స్థాయిలో కాపీ రైట్స్ ఆరోపణలను ఎదుర్కొంది. ఈ చిత్రంలోని ‘‘వరాహ రూపం’’ అనే పాటను కాపీ కొట్టారంటూ కేసులు నమోదలయ్యాయి. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసుపై కేరళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులోకి అనవసరంగా నటుడు పృథ్వీరాజ్ ను లాగుతున్నారని జస్టిస్ కురియన్ థామస్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయన కేవలం డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తేల్చి చెప్పింది. ఈ కేసుపై ఫిబ్రవరి 22 వరకు స్టే విధిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.


‘‘వరాహ రూపం’’ పాట విషయంపై మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ కంపెనీ కొద్ది రోజుల క్రితం కొజికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పృథ్వీరాజ్ ప్రొడక్షన్ లిమిటెడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేరళలో ‘కాంతార’ సినిమాకు పృథ్వీరాజ్ ప్రొడక్షన్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  ఆ కంపెనీకి డైరెక్టర్ గా కొనసాగుతున్న పృథ్వీరాజ్ పైనా కేసు నమోదు అయ్యింది. వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా కోర్టు స్టే విధించింది.


తొలి నుంచి ‘‘వరాహ రూపం’’ పాటపై వివాదమే!


వాస్తవానికి  ‘కాంతార’ చిత్రంలోని ‘‘వరాహ రూపం’’ పాట తొలి నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. ఈ పాట ట్యూన్ మలయాళ ఆల్బమ్ సాంగ్ నుంచి కాపీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పాట తమ పాటకు కాపీ అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి సంచలన ఆరోపణలు చేసింది. ‘‘వరాహ రూపం’’ పాటను నవరసం పేరుతో బ్యాండ్‌ తైక్కుడం మ్యూజిక్‌ బ్యాండ్‌ ఎప్పుడో విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ పాటను కాపీ కొట్టారని ఆరోపించింది. మాతృభూమి యాజమాన్యంలోని 'కప్ప టీవీ' తైక్కుడం బ్రిడ్జ్ బ్యాండ్ పాటను ప్రదర్శించింది. నిజానికి పృథ్వీరాజ్ ‘కాంతార’ సినిమా నిర్మాణంలో  భాగస్వామి కాదు. అయినా, కేరళలో ‘కాంతార’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. అందుకే ఆయనపై కేసు నమోదు అయ్యింది. 






Read Also: చెర్రీ మనసు దోచిన ఇద్దరు హీరోయిన్లు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?