లాపతా లేడీస్ (Laapataa Ladies Movie)... ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ సినిమా పేరు మార్మోగుతోంది. ఎందుకు? అంటే... ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా ఓ సినిమాను పంపుతుంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Film Federation Of India). ఆస్కార్ 2025 (Oscar 2025)కు 'లాపతా లేడీస్'ను పంపుతున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమాలను కాదని మరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ సినిమా విశేషాలు ఏమిటో తెలుసా?


ఆమిర్ ఖాన్ మాజీ భార్య తీసిన సినిమా!
'లాపతా లేడీస్' చిత్రానికి బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు. ఆ మాజీ జంటతో పాటు జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. నితాన్షి గోయోల్, స్పర్శ్ శ్రీవాత్సవ, ప్రతిభా రత్న కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డులకు మన ఇండియా తరఫున 'లాపతా లేడీస్' అధికారిక ఎంట్రీ అవుతుందని కొన్ని రోజుల ముందు కిరణ్ రావు ఊహించారు. ఆమె అనుకున్నట్టు జరిగింది.


అసలు 'లాపతా లేడీస్' సినిమాలో ఏముంది?
Laapataa Ladies Storyline: 'లాపతా లేడీస్' థియేటర్లలో విడుదలైనప్పుడు, ఆ తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చినప్పుడు చలన చిత్ర ప్రముఖులతో పాటు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. అసలు ఈ  సినిమాలో ఏముంది? అంటే... 


ఉత్తర భారతంలోని సంస్కృతీ సంప్రదాయాలు, వివాహ  వ్యవస్థపై సున్నిత విమర్శ చేస్తూ తీసిన సినిమా 'లాపతా లేడీస్'. కొత్తగా పెళ్లైన ఓ జంట రైలు ఎక్కుతుంది. ఆ బోగిలో పెళ్లైన జంటలు మరికొందరు ఉన్నారు. నవ వధువులు అందరూ ఒకే విధమైన శారీ కడతారు. ముఖం కనిపించకుండా మేలి ముసుగు ధరిస్తారు. అదీ ఒకే విధంగా ఉంటుంది. తమ ఊరికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు చూస్తే... తన భార్య బదులు మరొకరు ఉంటారు. అతను కట్టుకున్న భార్య రైలులో తప్పిపోతుంది. అసలు ఆమె ఎక్కడ ఉంది? ఆమె బదులు వచ్చిన మరొక నవ వధువు ఎవరు? ఆమె కథ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!



'కల్కి 2898 ఏడీ', 'యానిమల్' సినిమాలను కాదని...
ఆస్కార్ అవార్డుల్లో ఎంట్రీ కోసం 'లాపతా లేడీస్'తో పాటు తెలుగు నుంచి 'కల్కి 2898 ఏడీ', 'హను - మాన్', అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' సినిమాలు సైతం పోటీ పడ్డాయి. తమిళం నుంచి చియాన్ విక్రమ్ 'తంగలాన్', విజయ్ సేతుపతి 'మహారాజా', మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'ఆడు జీవితం' (ది గోట్ లైఫ్), హిందీ సినిమాలు 'చందూ ఛాంపియన్', 'ఆర్టికల్ 360', 'కిల్' వంటివి కూడా ఉన్నాయి. పోటీలో వాటన్నటినీ దాటుకుని 'లాపతా లేడీస్' ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక అయ్యింది.


Also Read2024 ఇయర్ ఎండ్‌లో మళ్ళీ నేషనల్ అవార్డ్స్ - నాలుగు నెలల్లో ఇంకోసారి ఎందుకు ఇస్తున్నారంటే?