Garikipati Satires On Kalki 2898 AD: రీసెంట్ గా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు. మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు. 


భీముడు, కృష్ణుడు విలన్లా?


భారతంలో ఉన్నది ఒకటైతే, సినిమాలో చూపించింది మరొకటిన గరికపాటి వెల్లడించారు. “కర్ణుడు ఎవరో తెలియకపోతే ‘కల్కి‘ సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. సినిమా వాళ్లు ఏం చూపిస్తే అది. భారతంలో ఉన్నది వేరు. అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంట్ గా హీరోలు అయిపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయ్యారో మాకు అర్థం కాలే. బుర్ర పాడైపోతుంది. భారతం చాలా చదివితే అర్థం అవుతుంది. కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. అశ్వత్థామకు ఆ అవసరం లేదు. అశ్వత్థామ మహా వీరుడు. ఇందులోనేమో ‘ఆచార్య పుత్రా ఆలస్యమైనదా?’ అనే డైలాగ్ పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. మనకు ఏది కావాలంటే అది పెట్టేడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామంటే డైలాగ్ రాసే వాడు రాసిచ్చేస్తాడు” అంటూ సటైర్లు విసిరారు.






నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ గురించి ఏం చెప్పారంటే?


‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ముందే ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాను ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మూడు వేరు ప్రపంచాల మధ్య కథతో తెరకెక్కించినట్లు వివరించారు. ప్రపంచంలో తొలి నగరం కాశీ... చివరి నగరం కూడా కాశీ అని ఊహించుకుని ఈ కథ రాసినట్లు చెప్పారు. కలియుగం అంతం అయ్యే సమయంలో కాశీలో ఉండే మనుషులు, వారి పరిస్థితులు, టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు? ఇందులో చూపించినట్లు చెప్పారు. అయితే, గరికపాటి మాత్రం సినిమా కథ గురించి కాకుండా, కేవలం భారతంలోని పాత్రలను తప్పుగా చూపించడం పైనే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.



‘పుష్ప’ సినిమాపైనా గరికపాటి సెటైర్లు


‘కల్కి 2898 ఏడీ’ సినిమా మీదే కాదు, గతంలో ‘పుష్ప’ సినిమా పైనా గరికపాటి సెటైర్లు వేశారు. స్మగ్లింగ్ చేసే వాడిని హీరోని చేశారని విమర్శించారు. “స్మగ్లింగ్ చేసే వాడిని హీరోగా చేశారు. పైగా తగ్గేదేలే అంటాడు. స్మగ్లింగ్ చేసే వాడెవడైనా తగ్గేదేలే అంటాడా? అతడు ఏమైనా హరిశ్చంద్రుడా? సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఈ సినిమా డైరెక్టర్, హీరో కనిపిస్తే ఈ విషయాన్ని అడిగి కడిగి పారేస్తా” అంటూ విమర్శించారు.


‘కల్కి 2898 ఏడీ’ గురించి..


‘కల్కి 2898 ఏడీ’ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం వచ్చే ఏడాది షూట్ చేయనున్నారు. ఈ సినిమాకు 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.


Read Also: లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండండి - దర్శకుడు శంకర్ సీరియస్ వార్నింగ్ ఆ రెండు సినిమాలకేనా?