Karan Johar Slams Comedian: కరణ్ జోహార్. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో రెండున్నర దశాబ్దాలకుపైగా రాణిస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది కాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఆయనను తాజాగా ఓ కమెడియన్ దారుణంగా అవమానించారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కరణ్ బాగా ఫీలయ్యారు. తన బాధనంతా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
కరణ్ జోహార్ ఎందుకు అంతలా ఫీలయ్యారు?
నిజానికి కరణ్ జోహార్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోట్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీలో నెపోటిజంను పెంచి పోషిస్తున్నాడంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూనే ఉంటారు. అయితే, ఆయన సదరు విమర్శలను పెద్దగా పట్టించుకోరు. చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. కానీ, తాజాగా ఓ పాపులర్ రియాలిటీ షోలో ఓ కమెడియన్ కరణ్ మరింత దారుణంగా ఇమిటేట్ చేశాడట. కరణ్ వాళ్ల అమ్మతో కలిసి షో చూస్తుండగా ఆ షో ప్రోమో వచ్చిందట. దానిని చూసి కరణ్ కు చాలా బాధ కలిగిందట.
ఇంతకీ కరణ్ ఏమన్నారంటే?
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తనపై అత్యంత దారుణంగా అవమానించారని కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ షో ప్రోమో చూశాక, కోపం రావడం కంటే బాధ కలిగిందన్నారు. “నేను, మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. అప్పుడే ఓ పాపులర్ చానెల్ లో రియాలిటీ కామెడీ షో ప్రోమో వచ్చింది. అందులో ఓ కమెడియన్ నన్ను చాలా దారుణంగా ఇమిటేట్ చేశాడు. ఇలాంటివి సోషల్ మీడియా ట్రోలర్స్ నుంచి వచ్చాయంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మంచి పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాగాలలేదు. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇలా అవమానించడం మంచిది కాదు. ఈ ప్రోమో చూశాక నాకు కోపం రాలేదు. కానీ, చాలా బాధ కలిగింది” అని కరణ్ జోహార్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు? అనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.
ఈ నెల చివరలో 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' విడుదల
ఇక కరణ్ జోహార్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నిర్మాతగా `మిస్టర్ అండ్ మిసెస్ మహి` సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాజ్ కుమార్ రావు, జాన్వీ కపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించబోతున్నారు. ఈ చిత్రం మే 31న థియేటర్లలో విడుదల కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Read Also: ‘బైసన్ కాలమాడన్’ - ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ బయోపిక్ టైటిల్ భలే ఉంది గురూ!