Mari Selvaraj's Film With Dhruv Vikram Titled Bison Kaalamaadan: తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాజ్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఓ స్పోర్ట్స్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ ప్లేయర్ గా కెరీర్ ను మొదలు పెట్టి రాజకీయ నాయకుడిగా మారిన మనతి పి గణేషన్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు.


ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ బయోపిక్ టైటిల్ ఖరారు


ధృవ్ స్పోర్ట్స్ బయోపిక్ కు ‘బైసన్ కాలమాడన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కబడ్డీ ప్లేయర్ పి గణేషన్ పాత్రలో కనిపిస్తున్న ధృవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. రైడింగ్ కు వెళ్తున్న పోజులో ధృవ్ ఆకట్టుకుంటున్నాడు. ఆయన వెనుక ఉన్న అడవి దున్న ఫోటో మరింత గాంభీర్యంగా కనిపిస్తోంది. అడవిదున్న మాదిరిగా కబడ్డీ కోర్టులో చెలరిగిపోతాడు అన్నట్లుగా ఈ పోస్టర్ ను రూపొందించారు.


ఎవరీ  మనతి పి గణేషన్?


తొంభైల్లో.. పి గణేషన్ తమిళనాడులో స్టార్ కబడ్డీ ప్లేయర్ గా కొనసాగారు. 1995లో ఆయన అర్జున అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయన జీవిత కథ ఆధారంగా సెల్వరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రింగుల జుట్టు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు  నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఎజిల్ అసుర కె సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శక్తి తిరు ఎడిటర్ గా కొనసాగుతున్నారు.  


ధృవ్ కెరీర్ లో మూడో సినిమా


విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ధృవ్.. ‘ఆదిత్య వర్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ చక్కటి విజయాన్ని అందుకుంది. రెండో సినిమా ‘మహాన్’లో తండ్రి విక్రమ్ తో కలిసి నటించారు. తండ్రికి మించిన నటనతో అలరించాడు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. చాలా కాలం తర్వాత ధృవ్ నటిస్తున్న ‘బైసన్ కాలమాడన్’ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, తొలి చిత్రం ‘ప‌రియేరుం పెరుమాల్‌’తో నేషనల్ అవార్డు అందుకున్న సెల్వరాజ్, ఆ తర్వాత ‘క‌ర్ణ‌న్’, ‘మామ‌న్న‌న్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ‘బైసన్ కాలమాడన్’ చిత్రంతో మరోసారి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను  నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించినట్లు సమాచారం.  






Read Also: డంప్ యార్డులో 10 గంటలు మాస్క్ లేకుండా - ‘కుబేర’ కోసం ధనుష్ అంత కష్టపడ్డారా?