Best Horror Movies On OTT: ఘోస్ట్ హంటర్స్ అనేవాళ్లు దెయ్యాలను కనిపెట్టడం, వాటితో ఏవేవో ప్రయోగాలు చేయాలని చూడడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక కథతోనే ‘13 ఘోస్ట్స్’ అనే డిఫరెంట్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా చూసిన వారంతా కథ చాలా కొత్తగా ఉంటుంది అని పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. కానీ 2001లో ఈ మూవీ విడుదలైంది.


కథ..


‘13 ఘోస్ట్స్’ కథ విషయానికొస్తే.. సైరస్ క్రిటికోస్ (ఎఫ్ ముర్రే అబ్రహం).. ఒక ఘోస్ట్ హంటర్. తను 13 దెయ్యాలను కలిపి ఒక ప్రయోగం చేయాలనుకుంటాడు. అందుకు 12 దెయ్యాలను సక్సెస్‌ఫుల్‌గా బంధించగలుగుతాడు. కానీ 13వ దెయ్యాన్ని బంధించే క్రమంలో సైరస్ మరణిస్తాడు. సైరస్ చనిపోయే ముందు తన బంధువులు ఆర్థర్ క్రిటికోస్ (టోని షాల్హౌబ్)కు తన ఇల్లు చెందాలని విల్లు రాసినట్టుగా సైరస్ లాయర్ బెంజమిన్ అలియాస్ బెన్ మోస్ (జేఆర్ బౌర్నీ) వచ్చి ఆర్థర్‌కు చెప్తాడు. అప్పటికే చాలా పేదరికంలో ఉండి కష్టాలు పడుతున్న ఆర్థర్.. ఇది తనకు మంచి అవకాశం అనుకొని తన పిల్లలతో సహా సైరస్ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. కానీ దాని వల్లే తనకు సమస్యలు తలెత్తుతాయని అప్పుడు ఆర్థర్‌కు తెలియదు.


ఆర్థర్.. తన పిల్లలతో కలిసి సైరస్ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు.  ఆ ఇల్లు మొత్తం గ్లాస్‌ నిర్మాణం. ఆ గ్లాస్‌పై లాటిన్ భాషలో ఏవో మంత్రాలు కూడా రాసుంటాయి. సైరస్ ఒక ఘోస్ట్ హంటర్ కాబట్టి తన ఇంటిని అలా డిజైన్ చేసుకొని ఉంటాడని ఆర్థర్ పెద్దగా పట్టించుకోడు. అదే సమయంలో సైరస్ అసిస్టెంట్ డెనిస్ రఫ్కిన్ (మాథ్యూ లిలార్డ్).. తానొక ఎలక్ట్రీషియన్ అని అబద్ధం చెప్పి ఇంట్లోకి వస్తాడు. సైరస్ చనిపోయే ముందు ఆ 12 దెయ్యాలను ఎక్కడ బంధించాలో తెలుసుకోవడం కోసం డెన్నీస్ ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ ఇంటి బేస్మెంట్‌లో ఆ దెయ్యాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. అదే విషయం వచ్చి ఆర్థర్‌కు చెప్తాడు. ఆ దెయ్యాల వల్ల ఆర్థర్‌కు ఎలాంటి హాని జరుగుతుంది? అసలు సైరస్.. ఆ 13 దెయ్యాలతో ఏం చేయాలనుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.



అక్కడే మిస్..


‘13 ఘోస్ట్స్’ కథను ప్రేక్షకులు ముందెప్పుడూ చూసుండరు. ఇదే కథను ప్రేక్షకులకు మరింత అర్థమయ్యేలా, మరింత థ్రిల్లింగ్‌గా తెరకెక్కించుంటే మూవీ చాలా పెద్ద సక్సెస్ సాధించి ఉండేది. కానీ స్క్రీన్ ప్లే ఆడియన్స్‌ను మెప్పించకపోవడంతో ‘13 ఘోస్ట్స్’ గురించి ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు తెలియదు. యాక్టింగ్ పరంగా నటీనటుల నటన పరవాలేదు అనిపిస్తుంది. 1960లో ఇదే టైటిల్‌తో తెరకెక్కిన మూవీని దర్శకుడు స్టీవ్ బెక్ 2001లో మళ్లీ రీమేక్ చేశాడు. మొత్తానికి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ హారర్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో ఉన్న ‘13 ఘోస్ట్స్’ను చూసేయొచ్చు.


 


Also Read: కళ్ల ముందే కొడుకు అపహరణ - వెంటాడి, వేటాడే తల్లి.. చివరి వరకు ఉత్కంఠతో కట్టిపడేసే థ్రిల్లర్ మూవీ ఇది