Kidnap (కిడ్నాప్) 2017లో విడుదలయిన అమేరికన్ యాక్షన్ థ్రిల్లర్. సినిమా నిడివి గంటన్నరే. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉత్కంఠతో చూసేవిధంగా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. సింగిల్ పేరెంట్ అయిన కార్ల డైసన్ తన ఆరేళ్ల కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకరోజు ఆమె కొడుకు కిడ్నాప్ అవుతాడు. తన కొడుకు జాడ దొరికే వరకు ఆ తల్లి చేసిన పోరాటమే ఈ కథ. కొడుకు ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతాడు? అసలు దొరుకుతాడా లేదా? అని మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చివరి వరకూ ఉత్కంఠతో చూసే విధంగా ఈ కథ ఉంటుంది.


ఇదీ కథ


కార్ల అనే మహిళ తన భర్తతో విడాకులు తీసుకొని, ఒక రెస్ట్రాంట్ లో పనిచేస్తుంది. తనకు ఒక ఆరేళ్ల కొడుకు ఉంటాడు. అతని పేరు ఫ్రాంకీ. తను పడుతున్న కష్టం పిల్లాడికి ఏ రోజూ తెలియనీయకుండా ఫ్రాంకీని పెంచుతుంది. ఒకరోజు ఫ్రాంకీని పార్క్ కి తీసుకెళ్తానని మాటిస్తుంది. అన్నట్టుగానే తొందరగా వర్క్ పూర్తి చేసుకొని, ఫ్రాంకీని బయటకు తీసుకెళ్తుంది. అక్కడ ఫ్రాంకీ ఆడుకుంటూ ఉండగా ప్రతీ రెండు నిమిషాలకోసారి పిలుస్తూ కనిపెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక లాయర్ నుంచి కార్లాకు కాల్ వస్తుంది. తన కంటే తన మాజీ భర్తకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్రాంకీ కస్టడీ భర్తకే చెందుతుందని, లాయర్ చెప్తాడు. ఫ్రాంకీని తనే పెంచాలని తను ఎంతో ఫైట్ చేస్తుంది.


ఇంతలో తన ఫోన్‌లో బ్యాటరీ అయిపోయి, కాల్ కట్ అయిపోతుంది. ఫ్రాంకీ కోసం చూస్తే అక్కడ పిల్లాడు కనపడడు. ఆ చోటంతా వెతుకుతుంది. ఫ్రాంకీ చేతిలో ఉండే రిసీవర్ బెంచ్ మీద పెట్టి ఉంటుంది. దూరంగా ఒక మహిళ ఫ్రాంకీని కారులో బలవంతంగా తీసుకెళ్ళటం చూసి కార్ల షాక్ అవుతుంది. వెళుతున్న కారు నుంచి ఫ్రాంకీని తీసుకోవటానికి ప్రయత్నించి కిందపడిపోతుంది. దీంతో ఫోన్ కూడా పగిలిపోతుంది. తన కార్ తీసి కిడ్నాపర్ కారును ఫాలో అవుతుంది. సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు తన కొడుకుని కాపాడటానికి మిగిలిన కార్లో వాళ్ళను హెల్ప్ అడుగుతుంది. ఎవరూ పట్టించుకోరు. తర్వాత ఆ కిడ్నాపర్ కార్ కనిపించకుండా వెళ్లిపోతుంది. 


ఆమె "దేవుడా నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు.. నా కొడుకుని నాకు కనిపించేలా చేయి" అని ప్రార్థన చేస్తుంది. అప్పుడు కిడ్నాపర్ కార్ కనిపిస్తుంది. తిరిగి ఫాలో చేస్తుండగా, ఆ కిడ్నాపర్ ఫ్రాంకీ తలను బయటకు పెట్టి అతని మెడ కత్తి పెట్టి, నువ్వు ఇక్కడే ఫాలో చేయడం ఆపేయకపోతే ఫ్రాంకీని చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు కార్ల ఏడుస్తూ ఫాలో చేయటం ఆపేస్తుంది. ఆ తర్వాత సినిమా రకరకాల ట్విస్టులు తిరుగుతుంది. ఆమె ఘోరమైన పరిస్థితులను ఎంతో తెలివిగా ఎదుర్కొంటుంది.


చివరికి ఆమె తన ప్రాణాలను అడ్డేసి తన కొడుకును కాపాడుకుంటుంది. అంతే కాదు.. ఆ కిడ్నాపర్స్ దాచిపెట్టిన మరో ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా ఆమె కాపాడుతుంది. ఒక తల్లి తలుచుకుంటే తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక యోధురాలిలా పోరాడుతుంది అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని తెలుగులోనూ చూడవచ్చు.


Also Read: ఆ వీరవనిత తన రొమ్ములను ఎందుకు కోసిచ్చింది? అలనాటి వీరుల రియల్ స్టోరీనే ఈ మూవీ