‘Pathonpatham Noottandu’ (పథానపథం నూత్తాండు) 2022లో విడుదలయిన మలయాళం పిరియాడిక్ డ్రామా ఫిల్మ్. ఈ టైటిల్ కు అర్థం..19వ శతాబ్దం. ఈ మూవీని ‘పులి: the 19th century’ టైటిల్‌తో తెలుగులోనూ విడుదలైంది.


కథ:


అది ఇండియా ఆంగ్లేయుల ఆధీనంలో బానిసలుగా ఉన్న కాలం. ప్రజల నుంచి రాజులు ప్రతీ చిన్నదానికి అడ్డగోలుగా పన్నులు వసూలు చేసి, అవి బ్రిటీష్ వారికి చెల్లిస్తూ, వారి కింద సామంత రాజులుగా ఉండేవారు.


కేరళలో ఇది వరకే ఉన్న ఎన్నో పన్నులతో పాటు కొత్తగా మగవారి మీసాలకు ఆడవారి రొమ్ములకూ కూడా పన్ను వసూలు చేసేవారు. ఇంతేకాకుండా తక్కువ కులస్థులను రోడ్డు మీద కూడా నడవనిచ్చేవారు కాదు. తక్కువ జాతికి చెందిన స్త్రీలు.. పై వస్త్రాలు ధరించి, వారి శరీరభాగాలను కప్పుకోకూడదు. మోకాళ్ల కిందకు బట్టలు కట్టకూడదు వంటి నీచమైన నిబంధనలు అమలులో ఉండేవి. పాటించకపోతే మరణ దండనే. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, బ్రిటీష్ వారి చేతిలో ప్రాణాలను కోల్పోయాడు. ఆ వీరుడి పేరు.. అరాట్టుపుళ వేలాయుధ పానిక్కర్. చరిత్రలో ఇతని గురించి ఎక్కువగా రాయలేదు. కానీ ఇతని కథ ఆధారంగానే తీసిన చిత్రం ఇది.


బ్రిటీష్ వారు భారతీయులను బానిసల్లా చూస్తూ, వారి మధ్య కుస్తీ పోటీలు పెట్టి ఒకర్నొకరు చంపుకోవడాన్ని చూసి ఎంజాయ్ చేసేవారు. బ్రిటీష్ వారి మెప్పు పొందటానికి భూస్వాములు కూడా కుస్తీ పోటీలు పెట్టడం, పేద స్త్రీలను బ్రిటీష్ వారి దగ్గరికి పంపటం వంటివి చేసేవారు. ఒకరోజు కుస్తీ పోటీ జరుగుతుండగా వేలాయుధ అక్కడికి వచ్చాడు. తక్కువ కులస్థుడైనా ధనవంతుడనే కారణంతో అక్కడి వరకు రానిస్తారు. కైమల్ అనే భూస్వామి వేలాయుధను చూసి తక్కువజాతి వాడివైనా డబ్బివ్వటానికి ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈసారి క్షమిస్తున్నాను అంటాడు. అక్కడ కుస్తీ పోటీలో ఓడిపోయిన వ్యక్తిని బ్రిటీష్ వారు చంపేయబోతారు. అది చూసి వేలాయుధ బ్రిటీష్ వారి మీద ఎదురు తిరుగుతాడు. దీంతో బ్రిటీషర్లు అతడిపై కాల్పులకు ప్రయత్నిస్తారు. ఆ దాడి నుంచి వేలాయుధ తప్పించుకుంటాడు.


ట్రావెంకోర్ సంస్థానానికి చెందిన రాజు ఒకరోజు అందర్నీ సమావేశపరిచి, పద్మనాభస్వామి ఆలయంలో విలువైన సాలగ్రామ నగలను దొంగిలించిన వాడిని మీరింకా పట్టుకోలేకపోయారని మందలిస్తాడు. మంత్రి ఆ దొంగతనం కొచ్చున్ని అనే ఒక వ్యక్తి చేసాడని, అతన్ని పట్టుకోవటానికి ఇంకొంత సమయం కావాలని రాజును కోరుతాడు. అదే సమయంలో వేలాయుధ అక్కడికి వస్తుండగా, అక్కడి సైన్యాధికారి నంబి అడ్డుకొని.. తక్కువ జాతివాడివైన నీకు లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు అంటాడు. అప్పుడొక వ్యక్తి వచ్చి వేలాయుధను రాజు గారే రమ్మన్నారని చెప్తాడు. నగలు దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవాలని.. రాజు వేలాయుధను కోరుతాడు. ఆ ఆస్థాన పండితులు దీన్ని తప్పు పడుతారు. ఒక తక్కువ కులస్థుడు గుడిలోకి రావటానికే అనుమతి లేదు. దేవుడి నగలు ఎలా ముట్టుకోనిస్తారు. ఇది తప్పు అని రాజుతో అనటంతో రాజు వేలాయుధను వెనక్కి పంపించేస్తాడు.


పేద మహిళలకు లీడర్ గా వ్యవహరించే నన్నేలి అనే మహిళపై వస్త్రాలతో తన రొమ్ములు దాచుకున్నందుకు సైన్యాధికారి నంబి దాడికి పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో ఆమె తన రొమ్ములు కోసిచ్చి.. ‘‘ఇది తీసుకెళ్లి మీ మహారాజుకు ఇవ్వండి. మానమర్యాదలు లేని ఈ రాజ్యంలో నేను బతకను’’ అంటుంది. దీంతో వేలాయుధ కుల వ్యవస్థ మీద, ఆడవారి మీద జరుగుతున్న అరాచకాల మీద పోరాటం చేస్తాడు. అందులో భాగంగానే బ్రిటీష్ వారి చేతిలో ఒకరోజు యుద్ధంలో చివరికి మరణిస్తాడు. బానిస సంకెళ్ళను తెంచుకోవటానికి చేసిన ఏ వీరుని పోరాటమూ చిన్నది కాదు.. చివరకు వారి ప్రాణాలను పణంగా పెట్టి తిరుగుబాటు చేసిన కొందరి చరిత్రల గురించి, చరిత్ర మర్చిపోయిన కొందరు వీరుల గురించి సినిమాలుగా రావటం మంచి విషయం. ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీలో తెలుగులోనూ చూడవచ్చు. 


Also Read: అమ్మాయిలను చంపే సైకో కిల్లర్‌కు ట్రాకర్ పెడితే? ఈ మూవీలో హీరోనే ఎక్కువ భయపెడతాడు