Best Thriller Movies On OTT: ఒక చిన్న స్టోరీ లైన్‌ను తీసుకొని.. దానిని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లేదా హారర్‌గా మార్చాలంటే కొరియన్ మేకర్స్ పర్ఫెక్ట్ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అలాంటి ఒక స్టోరీ లైన్‌తో తెరకెక్కిన సినిమానే ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil). టైటిల్ చూసి ఇది హారర్ సినిమా అనుకుంటారేమో.. అస్సలు కాదు. ఇది ఒక పూర్తిస్థాయి రివెంజ్ డ్రామా. ముందు చెప్పినట్టుగానే కథ సింపుల్‌గానే ఉంటుంది. కానీ ఆ కథను నడిపించే తీరులోనే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను, దాంతో పాటు ఎంతో వైలెన్స్‌ను యాడ్ చేశాడు దర్శకుడు కిమ్ యీ వూన్. ఈ మూవీలో వైలెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. రక్తం చూడడానికి భయపడేవారు కచ్చితంగా ‘ఐ సా ది డెవిల్’కు దూరంగా ఉండడం మంచిది.


కథ..


‘ఐ సా ది డెవిల్’ కథ విషయానికొస్తే.. ముందుగా మూవీ ఓపెనింగ్ సీన్‌లో తన కారు ఆగిపోవడంతో ఒక అడవిలో తన భర్త కోసం ఎదురుచూస్తుంటుంది యూ యోన్ (ఓ సాన్ హా). అదే సమయంలో జాంగ్ క్యుంగ్ చుల్ (చియో మిన్ సిక్) అక్కడికి ఒక బస్‌ను డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. కారు ఆగిపోయిందని సాయం చేయాలా అంటూ యూ యోన్ దగ్గరికి వచ్చి అడుగుతాడు. కానీ తనకు ఎలాంటి సాయం వద్దని, తన భర్త వస్తున్నాడని అతడిని పంపించేస్తుంది యూ యోన్. కానీ క్యుంగ్ చుల్.. అక్కడి నుండి వెళ్లకుండా ఎదురుచూస్తుంటాడు. కట్ చేస్తే.. తరువాతి సీన్‌లో యూ యోన్‌ను కిడ్నాప్ చేసి తనను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు కుంగ్ చుల్. ఆమెను చంపింది ఒక సైకో కిల్లర్ అని పోలీసులు నిర్ధారిస్తారు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకుంటానని యూ యోన్ కాబోయే భర్త కిమ్ సో హ్యోన్ ఫిక్స్ అవుతాడు. క్యుంగ్ చుల్ కోసం కిమ్ వేట మొదలవుతుంది.


యూ యోన్‌ను హత్య కేసులో నలుగురు అనుమానితులను గుర్తిస్తారు పోలీసులు. వారి వివరాలను సేకరించి ఒక్కొక్కరినీ హింసిస్తూ వారు.. యో యూన్‌ను చంపారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు కిమ్. ఫైనల్‌గా క్యుంగ్ చులే ఆమెను చంపాడని తెలుసుకుంటాడు. తను ఒక బస్ డ్రైవర్‌ అని తెలుసుకున్న కిమ్.. ఆ బండికి ట్రాకర్ పెట్టి తను ఉన్న చోటును కనిపెడతాడు. అక్కడికి వెళ్లి తనను బాగా కొట్టి తన కడుపులో ట్రాకర్ పెడతాడు. దాని ద్వారా క్యుంగ్ చుల్ ఎక్కడికి వెళ్తున్నాడు అని మాత్రమే కాకుండా, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా కిమ్ ట్రాక్ చేస్తుంటాడు. అలా ప్రతీసారి క్యుంగ్ చుల్‌ను కిమ్ ఫాలో అవ్వడం తనను బాగా కొట్టి చంపకుండా వదిలేయడం కంటిన్యూ అవుతుంది. కొన్నాళ్లకు ట్రాకర్ గురించి తెలుసుకున్న క్యుంగ్ చుల్.. కిమ్ కుటుంబ సభ్యులను చంపేస్తాడు. దీంతో మన హీరో ఏం చేశాడు అనేదే మిగతా కథ.



మితిమీరిన వైలెన్స్..


మామూలుగా విలన్ సైకో కిల్లర్ అయితే తనను పట్టుకోవడానికి హీరో రంగంలోకి దిగి తన హీరోయినం చూపిస్తాడు. కానీ ‘ఐ సా ది డెవిల్’లో అలా కాదు.. సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన హీరో.. విలన్‌కంటే ఎక్కువ విలనిజం చూపిస్తాడు. అదే ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్. ఇది ఒక రొటీన్ సైకో కిల్లర్ కథలాగానే ఉన్నా.. విలన్ దొరకగానే తనను చంపకుండా హింసిస్తూ ఉండడాన్ని చాలామంది ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అందుకే ఈ రివెంజ్ డ్రామా.. కొరియన్ బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. టైటిల్‌లో ఉన్నదాని ప్రకారం హీరోని డెవిల్ అనాలా? విలన్‌ను డెవిల్ అనాలా అనేది ప్రేక్షకులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ మూవీ కొరియన్‌తో పాటు ఇంగ్లీష్, తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.


Also Read: ఆ కళ్లను ఇండియా, పాక్ బోర్డర్‌లో ఎందుకు పాతారు? మనుషులను ఆవహించే ఆ ‘రెడ్ ఐ’ని అడ్డుకొనేది ఎవరు? సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే మూవీ ఇది