కను బెహ్ల్ దర్శకత్వంలో రూపొందిన రియలిస్టిక్ చిత్రం ‘ఆగ్రా’. అతికా చోహన్ కథ అందించిన ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక అయ్యింది. డైరెక్టర్స్ ఫోర్ట్‌ నైట్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.  కేన్స్ అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రదర్శించబడిన బెహ్ల్ తొలి చిత్రం ‘తిత్లీ’ కాగా, రెండో చిత్రం ‘ఆగ్రా’ కావడం విశేషం. ‘ఆగ్రా’ చిత్రంలో రాహుల్ రాయ్, ప్రియాంక బోస్,  మోహిత్ అగర్వాల్, రుహాని శర్మ, విభా చిబ్బర్, సోనాల్ ఝా, ఆంచల్ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు.


సైకోసెక్సువల్ డ్రామాగా తెరెక్కిన ‘ఆగ్రా’


‘ఆగ్రా’ చిత్రం సైకోసెక్సువల్ డ్రామాగా రూపొందింది. 24 ఏండ్ల యువకుడు భయంకరమైన లైంగిక కోరికలతో ఎలా పశువులా ప్రవర్తిస్తాడు అనేది ఈ చిత్రంలో చూపించారు.  ఒక కుటుంబంలోని లైంగిక గతిశీలత, ఆధునిక భారతదేశంలో సృష్టించబడిన లోతైన డిస్టోపియన్ ఫ్రాక్చర్‌ల అన్వేషిస్తూ ఈ కథ ముందుకు కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాన్ని అందరూ చూడలేరు. చాలా భయానకంగా రియలెస్టిక్‌గా తెరకెక్కించారు. గురు (మోహిత్ అగర్వాల్) తీవ్రమైన లైంగిక అణచివేతకు గురవుతాడు. ఇంటర్నెట్ కేఫ్‌లో ప్రీతి (ప్రియాంక బోస్)ని కలవడంతో గురు జీవితం మలుపు తిరుగుతుంది. లైంగిక వాంఛలతో తన జీవితం ఎలా మారుతుంది? ఎందుకు తను సెక్సువల్ సైకోగా మారుతాడు అనే విషయాన్ని ఈ చిత్రంలో భయంకరంగా తెరకెక్కించారు బెహ్ల్. సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడలేరని, ఆ సీన్స్ చూసేందుకు చాలా ధైర్యం కావాలని దర్శకుడు వెల్లడించాడు.


సంతోషం వ్యక్తం చేసిన కను బెహ్ల్


“’ఆగ్రా’ నాకు వ్యక్తిగతమైన, కష్టమైన అన్వేషణ, లైంగిక అణచివేతకు సంబంధించి  అంతర్గత అంతర్లీనాలను లోతుగా డైవ్ చేసే ప్రయత్నం చేశాను. కేన్స్ లో ప్రదర్శనకు రావడం సంతోషంగా ఉంది” అని బెహ్ల్ తెలిపారు. “డైరెక్టర్స్ ఫర్ట్‌ నైట్‌లో ‘ఆగ్రా’ వరల్డ్ ప్రీమియర్ లో ప్రదర్శించే అవకాశం రావడం మాకు గొప్ప గౌరవం. కను బెహ్ల్‌ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మేము అతడితో ఈ చిత్రాన్ని రూపొందించినందుకు  సంతోషిస్తున్నాం. కేన్స్‌‌లో ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని ఎదురుచూస్తున్నాం" అని సారెగామ ఇండియా లిమిటెడ్‌ వెల్లడించింది.   






కను బెహ్ల్ తక్కువ సినిమాలే చేసినా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్. హిందీ చిత్రసీమలో బాగా పాపులర్ అయ్యారు. అతడు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తిత్లీ’. ఈ చిత్రం మెల్బోర్న్, రియో ​​డి జనీరో, జ్యూరిచ్, ఫిల్మ్‌ ఫెస్ట్ హాంబర్గ్, BFI లండన్‌, సహా 2014 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కెమెరా డి ఓర్‌కు నామినేట్ చేయబడింది. దిబాకర్ బెనర్జీ ప్రొడక్షన్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రస్తుతం ‘ఆగ్రా’ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతకు ముందు ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్’, ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.


Read Also: ఆ కారణంతోనే రమేష్ బాబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు: కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు