టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. జూన్ 2న ఈ సినిమా విడుదల కానుంది.


పెళ్లి నాటికి ఇల్లు లేదు, కారు లేదు, వర్మ ఆఫీస్ లో పడుకునేవాడిని!


ప్రస్తుతం ‘అహింస’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అన్నారు. తన భార్య శ్రీవల్లిని చేసుకునే నాటికి ఇల్లు, కారు ఏవీ లేవన్నారు. తనకు పెద్దలు ఎవరూ లేకపోవడంతో అక్కినేని వెంకట్, జ్యోత్స్న ముందుండి పెళ్లి జరిపించినట్లు చెప్పారు.“వెంకట్ అక్కినేని గారి ఇంట్లోనే పెళ్లి కొడుకుని అయ్యాను. నాగేశర్వర్ రావు గారి కోడలు జోత్స్న గారు నన్ను తీసుకెళ్లి దగ్గరుండి పెళ్లి చేశారు. నా పెళ్లి పెద్దలు వెంకట్ అక్కినేని, జోత్స్న అక్కినేని. హైదరాబాద్ కంట్రీ క్లబ్ లో పెళ్లి జరిగింది. నాకు అప్పటి వరకు ఇల్లు లేదు. కారు లేదు. ఎలా పిల్లను ఇవ్వాలని అన్నారు శ్రీవల్లి వాళ్ల పేరెంట్స్. నేను అప్పటి వరకు వర్మ క్రియేషన్స్ ఆఫీస్ లో పడుకునే వాడిని. పెళ్లికి వారం రోజుల ముందు ఓ ఫ్లాటు అద్దెకు తీసుకున్నా. ఐదు రోజుల ముందు  ఓ కారు కొన్న. ఏం చూసి ఇవ్వాలనే ప్రశ్న వచ్చినప్పుడే వెంకట్ అక్కినేని గారు మాట్లాడి అన్నీ సెట్ చేశారు” అని చెప్పుకొచ్చారు.


పిల్లలకు నచ్చింది చేయాలని చెప్పా!


“నాకు ఇద్దరు బాబులు, ఒక పాప ఉండేవారు. చిన్నబ్బాయి చనిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. బాబును ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నాను.  మా పిల్లలు నన్ను అడిగారు. తర్వాత మేం ఏం చేయాలి? అని. నన్ను అడగొద్దని చెప్పను. ఫాదర్ గా చెప్పాలి కదా. అంటే, నేను చూపించిన దారిలో నువ్వెళ్లి సక్సెస్ కాకపోతే నన్ను తిడతావు. నాకు ఆ రిస్క్ వద్దు. నీకు ఎది రైటో అది చెయ్ అన్నాను. దానికి నా సపోర్టు ఇస్తానని చెప్పాను. డైరెక్షన్ చేయాలి అని దానికి సంబంధించిన కోర్సు చేశాడు. కథ సెట్ చేసి చెప్తాను అన్నాను. హీరోగా తనను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్లంతా మెచూర్డ్ గా ఆలోచిస్తారు. సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. అమ్మాయి చదువు పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చింది. పెళ్లి గురించి కూడా తనతో చెప్పాను. పెళ్లి కార్డులు ప్రింట్ చేసి, మా అమ్మాయి పెళ్లికి రండి అని చెప్పను. కాళ్లు కడుగుడు, కన్యాదానం లేదు. నీకు నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో అని చెప్పాను. భోజనాలు ఓ 10 మందికి పెడదాం అన్నాను.  పెళ్లయ్యాక నీకు నచ్చలేదు అనుకో, వదిలెయ్ అంతే అన్నాను. లైఫ్ లో హ్యాపీగా ఉండేలా చూసుకో. అబ్బాయికైనా, అమ్మాయికైనా ఇదే వర్తిస్తుంది. ఊళ్లోవాళ్ల కోసం బతకొద్దు. నీకోసం నువ్వు బతుకు. నేను చెప్పిన మాటలకు నా భార్య కూడా సరే అంటుంది” అన్నారు.


వర్మను ఎవరు ఏమన్నా నాకు నచ్చదు!


రామ్ గోపాల్ వర్మ అమ్మాయిల కాళ్లు పట్టుకోవడం, కాళ్లను నాకడం వంటి చేష్టాలపై స్పందిస్తూ “రామ్ గోపాల్ వర్మ అంటే నాకు ఇష్టం. అతడిని ఎవరు ఏం అన్నా నాకు ఇష్టం ఉండదు. ఆయన జీవితాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన లైఫ్ గురించి కొంత మంది వారి లైఫ్ ను వదిలేసి మాట్లాడుతున్నారంటే వారికి ఏం పనిలేదని అర్థం. ఆయన చేసే పనులను నేను సమర్దించను, ఖండిచను కూడా” అని అన్నారు.


Read Also: బిచ్చగాళ్లతో ‘బిచ్చగాడు’ హీరో - ‘యాంటీ బికిలీ’ కిట్లు పంపిణీ చేసిన విజయ్ ఆంటోని