Hyderabad Crime News: ఆ తల్లి భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోంది. మూడేళ్ల తన పాపను కూడా తన వెంట బెట్టుకొచ్చింది. చాలాసేపు ఆడుకున్న పాపకు బాగా నిద్ర రావడంతో.. విషయం గమనించిన తల్లి పాపను పడుకోబెట్టింది. అయితే అక్కడ ఎండగా ఉందని.. పక్కనే ఉన్న అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెడితే చల్లగా ఉంటుందని అక్కకడకు తీసుకెళ్లి నిద్ర పుచ్చింది. ఆ తర్వాత ఆమె వచ్చిన నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది. అయితే అపార్టుమెంటుకు చెందిన ఓ వ్యక్తి బయట నుంచి వచ్చాడు. తన పార్కింగ్ స్థలంలో పాప పడుకున్న విషయం తెలియక నేరుగా కారును పోనిచ్చాడు. దీంతో కారు పాప తలపైకి ఎక్కింది. తీవ్ర గాయాలపాలైన పాప అక్కడికక్కడే మృతి చెందింది. 


అసలేం జరిగిందంటే..?


కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా షాబాద్ కు చెందిన రాజు, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వాళ్లలో ఏడేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. అయితే బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన వారు బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని శ్రీ కృష్ణనగర్ లో నివాసం ఉంటున్నారు. హయత్ నగర్ సమీప లెక్చరర్స్ కాలనీలో బాలజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్లాబు పనులు చేస్తున్నారు. బుధవారం రోజు తమతో పాటే వచ్చిన చిన్నారి లక్ష్మీని తల్లి కవిత నిద్ర పుచ్చింది. తాను పని చేసే నీడ లేకపోవడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో బిడ్డను పడుకోబెట్టింది. ఆపై నిర్మాణ పనిలో నిమగ్నమైంది. అయితే అదే అపార్టుమెంటులో నివసించే హరిరామ కృష్ణ తన కారుతో బట నుంచి వచ్చారు. తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకుని ఉండటాన్ని గమనించకుండా కారును పార్కు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పాప తలపైకి కారు ముందు చక్రం ఎక్కింది. తీవ్ర గాయాలపాలైన పాప అక్కడికక్కడే మృతి చెందింది.   


విషయం తెలుసుకున్న తల్లి గుండెలవిసేలా రోదిచింది. చిన్నారిని పట్టుకొని ప్రాణాలు కాపాడమంటూ అక్కడున్న వారందరినీ వేడుకుంది. దీంతో స్థానికులంతా కలిసి పాపను వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప చనిపోయిందని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది. కాసేపు పడుకోమని నిద్ర పుచ్చితే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయావా అంటూ తల బాదుకుంటూ ఏడుస్తోంది. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read:  ముగ్గురు పిల్లలను చంపేసి దంపతులు ఆత్మహత్య


ఫిబ్రవరి నెలలోనూ ఇలాంటి ఘటనే.. 


మూడు నెలల క్రితం కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎనిమిదేళ్ల కుమారుడి పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే బాలుడి తండ్రి ఇటీవలే చనిపోవడం.. ఉన్న ఒక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలవడంతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.


అసలేం జరిగిందంటే..?


రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో ఓ ఇద్దరు బాలురు కింద కూర్చొని ఆడుకుంటున్నారు. ఇదే క్రమంలో కారు పార్కింగ్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. వారిపైకి దూసుకెళ్లాడు. ఓ బాలుడు వెంటనే తప్పించుకోగా.. మరో బాలుడు కారు కిందే ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి సదరు బాలుడిని కారు కింద నుంచి తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన బాలుడి పేరు జీవాన్ష్. సదరు బాలుడి తల్లిదండ్రులు శ్రావణి, సాయి. అయితే వీరు చిత్రపురి హెచ్ఐజీ-5- 705లో నివాసంలో ఉంటున్నారు. జీవాన్ష్ తండ్రి సాయి హెచ్ఐజీలో మేనేజర్ గా పని చేసేవాడు. కానీ ఆయన ఇటీవలే మరణించారు. ఈ బాధ నుంచి కుటుంబ సభ్యులు కోలుకోక ముందే.. మరో దెబ్బ తగలడంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బాలుడు జీవాన్ష్ మృత్యువుతో పోరాడుతున్నాడు. భర్తను కోల్పోయి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి.. కుమారుడికి ఏమవుతుందో అన్న బాధతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో, బకెట్‌లో - మహిళ తల గుర్తింపు కేసులో వణికిపోయే వాస్తవాలు