డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న తమిళ హీరోలలో విజయ్ ఆంటోనీ ఒకరు. 'నకిలీ' 'డాక్టర్ సలీమ్' 'బిచ్చగాడు' 'విజయ్ రాఘవ' వంటి వైవిధ్యమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాటిల్లో ‘బిచ్చగాడు’ మూవీ అతన్ని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిందని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. తెలుగులో ఏకంగా 100 రోజులు ప్రదర్శించబడి, డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన 'బిచ్చగాడు 2' కూడా అదే రేంజ్ సక్సెస్ దిశగా దూసుకెళుతోంది.


ఇటీవలే పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లోకి వచ్చిన 'బిచ్చగాడు 2' సినిమా తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుని, మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తమిళంలో కంటే తెలుగు వెర్షన్ అధిక వసూళ్ళు సాధించడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో విజయ్ ఆంటోనీ.. తన సినిమాని తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిని సందర్శించి, అక్కడి బిచ్చగాళ్లతో సందడి చేసాడు.


తిరుపతి కపిలతీర్థంలోని రోడ్డులో ఉన్న యాచకులను కలిశారు విజయ్ ఆంటోని. ‘యాంటీ బికిలీ’ పేరిట వారికి స్పెషల్ కిట్లను అందజేశారు. ఆ కిట్లలో దుప్పట్లు, చెప్పులు, అద్దం, దువ్వెన, సబ్బు, నూనె బాటిల్, పౌడర్, విసనకర్ర వంటి సామాగ్రి ఉన్నాయి. వారితో కాసేపు ముచ్చటించిన 'బిచ్చగాడు' హీరో.. వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. 






అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2' సినిమా విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ విజయాన్ని నేను ఊహించలేదు. తమిళంలో కంటే తెలుగు ఆడియన్స్ నా సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. 'బిచ్చగాడు 3' స్టోరీ విషయంలో ఇంకా ఏమీ ఆలోచించలేదు. 2, 3 నెలల్లో దీనిని ఫైనలజ్ చేస్తా’ అని విజయ్ తెలిపారు.


కాగా, 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'బిచ్చగాడు' మూవీ.. భారీ విజయం సాధించింది. విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. ఇప్పుడు మే 16న విడుదలైన "బిచ్చగాడు 2" చిత్రం, భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ. 12.20 కోట్ల గ్రాస్ తో రూ. 6.93 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోందని అంటున్నారు.


'బిచ్చగాడు 2' చిత్రానికి అన్నీ తానై నడిపించాడు విజయ్ ఆంటోనీ. హీరోగా నటించడమే కాదు, స్వయంగా స్టోరీ రాసుకుని డైరెక్టర్ అవతారమెత్తాడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ అనే హోమ్ బ్యానర్ లో తన భార్య ఫాతిమా విజయ్ పేరు మీదుగా నిర్మించారు. మ్యాజిక్, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడి కోలుకున్నారు విజయ్. అయితే ఆయన కష్టానికి ఇప్పుడు 'బిచ్చగాడు 2' తగిన ప్రతిఫలం అందించింది. 


'బిచ్చగాడు 2' సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. దేవ్ గిల్, రాధా రవి, వై జి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడి, జాన్ విజయ్, యోగి బాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఓం నారాయణ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.


Read Also: హ్యపీగా ఉన్నా, అది ఫేక్ న్యూస్ - ‘మృతి’ వార్తలపై సుధాకర్ వీడియో సందేశం