యువ కథానాయకుడు మానస్ నాగులపల్లి (Maanas Nagulapalli) ని మన తెలుగు ప్రేక్షకులకు, వీక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వై?  ఎందుకు? అంటే... బుల్లి తెర, వెండి తెర, డిజిటల్ తెర అని అతను ఏమీ తేడాలు చూపించడం లేదు. మంచి అవకాశం ఎక్కడ ఉన్నా అంది పుచ్చుకుంటున్నాడు. చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకవైపు సీరియల్స్ చేస్తూ... మరో వైపు సినిమాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోల్లో కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడీ హీరో హిందీకి పరిచయం అవుతున్నారు. 


'ప్యార్ కుల్హద్'తో హిందీకి...
మానస్ నాగులపల్లి కథానాయకుడిగా నటించిన సినిమా 'ప్యార్ కుల్హద్' (Pyara Kulhad Movie). ఇది హిందీ సినిమా. తెలుగులో ఆ టైటిల్ మీనింగ్ ఏంటి అంటే... అందమైన కత్తి లేదా ప్రేమ (తేన) పూసిన కత్తి అనుకోవచ్చు. ఈ సినిమాలో మానస్ జోడీగా అప్సరా రాణి (Apsara Rani) నటించారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో తెలుగులో కూడా ఆమె పాపులర్ అయ్యారు. హిందీ చిత్ర పరిశ్రమకు కూడా పరిచయం అయ్యారు. అయితే... హిందీలో మానస్ నాగులపల్లికి తొలి చిత్రమిది.


'ప్యార్ కుల్హద్'కు అభిషేక్ చద్దా దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం (మే 26వ తేదీన) థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఇందులో గుల్షన్ గ్రోవర్, ముఖేష్ ఖన్నా వంటి పేరున్న నటీనటులు ఉన్నారు. 


ఆల్ ది బెస్ట్ చెప్పిన అమితాబ్!
చిన్న సినిమాగా థియేటర్లలోకి వస్తున్న 'ప్యార్ కుల్హద్'కు అమితాబ్ బచ్చన్ (Big B Amitabh Bachchan) పెద్ద బూస్ట్ ఇచ్చారు. దర్శక నిర్మాత అభిషేక్ చద్దాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ... సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ పోస్ట్ చేశారు ఆయన. దాంతో ఉత్తరాది ప్రేక్షకుల చూపు ఈ సినిమా మీద పడింది.


Also Read : '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?


'లవ్ యు సార్' అంటూ అమితాబ్ బచ్చన్ పోస్ట్ కింద మానస్ నాగులపల్లి కామెంట్ చేశారు. లవ్ ఎమోజీలు యాడ్ చేశారు. తమ సినిమాకు అమితాబ్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మాటల్లో వర్ణించలేనని అప్సరా రాణి పేర్కొన్నారు. థియేటర్లలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి. 






'బ్రహ్మముడి'తో బుల్లి తెర వీక్షకుల్లో...
ఇప్పుడు తెలుగులో మానస్ నాగులపల్లి బిజీ ఆర్టిస్ట్. ఆయన హీరోగా నటిస్తున్న డైలీ సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi Serial) సీరియల్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో టెలికాస్ట్ అవుతున్న టాప్ సీరియళ్ళలో అదీ ఒకటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలకు వస్తే... తెలుగులో 'క్షీర సాగర మథనం' చేశారు మానస్. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. 


మానస్ మ్యూజిక్ వీడియోస్ సూపర్ హిట్!
తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ చేసే కల్చర్ ఇప్పుడు మొదలు అయ్యింది. ఆల్రెడీ 'గంగులు', 'జరీ జరీ పంచెకట్టి' అని రెండు మాస్ సాంగ్స్ చేశారు మానస్. 'నువ్వే కావాలి అమ్మ' అంటూ ఓ ఎమోషనల్ మదర్ సాంగ్ కూడా చేశారు. ఆ పాటలో మానస్ తల్లిగా సీనియర్ కథానాయిక ఆమని నటించారు.      


Also Read : టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా - మరీ ఇంత దారుణమా?