ఘట్టమనేని కృష్ణ మరణం తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు కృష్ణ, శేషగిరిరావు. కృష్ణ చనిపోయే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబానికి దిక్సూచిగా నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిశేషగిరిరావు, కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు గురించి కీలక విషయాలు చెప్పారు. ఆయన చనిపోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు.  


డిప్రెషన్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డ రమేష్ బాబు


రమేష్ బాబు మరణానికి కారణం డిప్రెషన్ అని చెప్పారు ఆదిశేషగిరిరావు. మిగతా హీరోలతో పోల్చితే తాను సక్సెస్ కావడం లేదనే ఆలోచనలు తీవ్రరూపం దాల్చి మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ‘బజారు రౌడీ’, ‘సామ్రాట్’, ‘ఎన్ కౌంటర్’ లాంటి హిట్ సినిమాలు చేసినా.. బాలకృష్ణతో పాటుగా రాణించలేకపోతున్నానే అని బాధపడే వాడని చెప్పారు. ఆ తర్వాత హీరోగా చేయడం మానేసి నిర్మాతగా మారినట్లు వివరించారు. చనిపోవడానికి కొంత కాలం ముందు ఆయనకు గుండె సమస్య ఉందన్నారు. ఆ సమయంలోనే ఆయనకు స్టంట్ వేసినట్లు చెప్పారు. ఆ తర్వాత కరోనా కారణంగా సమస్య తీవ్రమైనట్లు చెప్పారు.  త్వరలో రమేష్ బాబు కొడుకు జైకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. తను ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్లు తెలిపారు.  


గత ఏడాది జనవరిలో రమేష్ బాబు మృతి


ఘట్టమనేని రమేష్ బాబు బాల నటుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గుండె సంబంధ వ్యాధితో ఆయన గత ఏడాది(2022) జనవరిలో చనిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడిగా రమేష్ బాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయం అయ్యారు. అయితే, ఎక్కువ సినిమాలు చేయలేదు. బాల నటుడిగా ఓ అరడజను, కథానాయకుడిగా 15 చిత్రాలు చేశారు. సూప‌ర్ స్టార్‌ కృష్ణ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన సినిమా 'అల్లూరి సీతారామరాజు'తో రమేష్ బాబు వెండితెరకు బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఆయన చివరి సినిమా 'ఎన్‌కౌంట‌ర్‌'లో మెయిన్ హీరో కృష్ణే. మిగతా సినిమాలు కొన్నిటిలోనూ కృష్ణ హీరోగా నటించారు. కృష్ణ కుమారుడిగా రమేష్ బాబును ప్రేక్షకులు అభిమానించారు. అగ్ర దర్శకులు దాసరి, కోదండరామి రెడ్డి, వి. మధుసూదన్ రావు, జంధ్యాల సినిమాలు చేశారు. రెండు సినిమాలను కృష్ణ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు.  


అటు కృష్ణ కూతురు మంజుల సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రావాలి అనుకున్నా, ఆడియెన్స్ ఎందుకో పెద్దగా అట్రాక్ట్ కాలేదని చెప్పారు ఆదిశేషగిరిరావు. ముంబైలో సినిమా పరిశ్రమకు సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలను బాగానే ఆదరిస్తారు కానీ, ఇక్కడ పెద్దగా ఆదరించరని చెప్పుకొచ్చారు. ఇక తనకు ఒక కొడుకు ఉన్నారని చెప్పారు. తను కన్ స్ట్రక్షన్ రంగంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించారు.


Read Also: నా పిల్లలకు పెళ్లి చెయ్యను - ఆర్జీవీ ఏం చేసినా ఆయనకే నా సపోర్ట్: దర్శకుడు తేజ