సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోల సినిమాలను, మంచి కంటెంట్ తో రూపొందే చిత్రాలను ప్రశంసించడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా చూపకుండా, తనకు నచ్చితే ప్రతీ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తుంటారు. తనకు నచ్చిన అంశాలేంటో చెప్పి, మూవీకి మరింత బజ్ తీసుకొస్తారు. ఇప్పుడు తాజాగా 'మేమ్ ఫేమస్' సినిమా చూసిన మహేశ్.. ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇటీవల కాలంలో డిఫరెంట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా 'మేమ్ ఫేమస్'. యువ హీరో సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు శుక్రవారం (మే 26) ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మహేశ్ బాబు కోసం ఈ చిత్రాన్ని స్పెషల్ గా స్క్రీనింగ్ చేయగా.. తాజాగా చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు.
''ఇప్పుడే #MemFamous సినిమా చూసాను! ఇదొక అద్భుతమైన చిత్రం!! సినిమాలోని ప్రతి నటీనటుల పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోయాను. ముఖ్యంగా రచయిత, దర్శకుడు, నటుడు సుమంత్ ప్రభాస్ ఎంతో ప్రతిభ కలవాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కొంత మంది డెబ్యూటెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించారని నమ్మలేకపోతున్నా. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి , యువ బృందానికి నా అభినందనలు. మీరు ఇలాంటి టాలెంట్ కి మద్దతుగా నిలిచినందుకు గర్వంగా ఉంది'' అని మహేశ్ బాబు ట్వీట్ చేసారు.
'మేమ్ ఫేమస్' చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ & లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. చాయ్ బిస్కెట్ టీం గతంలో మహేష్ బాబు GMB ఎంటెర్టైన్మెంట్స్ తో కలిసి 'మేజర్' అనే పాన్ ఇండియా మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. అదే బ్యానర్ లో వచ్చిన 'రైటర్ పద్మభూషణ్' చిత్రానికి కూడా సూపర్ స్టార్ సపోర్ట్ గా ట్వీట్ చేసారు. ఇప్పుడు 'మేమ్ ఫేమస్' రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చి, సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇది కచ్చితంగా బుకింగ్స్ పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పాలి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 'మేమ్ ఫేమస్' సినిమా తెరకెక్కింది. ఇందులో సుమంత్ ప్రభాస్ తో పాటుగా మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చగా, శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Read Also: బిచ్చగాళ్లతో ‘బిచ్చగాడు’ హీరో - ‘యాంటీ బికిలీ’ కిట్లు పంపిణీ చేసిన విజయ్ ఆంటోని