మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'విరూపాక్ష' (Virupaksha Movie). ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. ఆమెను హీరోయిన్ అనడం కంటే విలన్ అనడం కరెక్ట్ ఏమో! వంద కోట్ల వసూళ్ళను రాబట్టిన చిత్రమిది. ఈ సినిమా పతాక సన్నివేశాల్లో సంయుక్త పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ చూసి ప్రేక్షకుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే... దర్శకుడు కార్తీక్ వర్మ దండు తొలుత రాసుకున్న కథలో విలన్ ఆమె కాదట!


శ్యామల విలన్ అయితే...
సుక్కు రాకతో మారింది!
'విరూపాక్ష'లో కథానాయకుడికి వరుసకు అక్క అయ్యే పాత్రలో యాంకర్ శ్యామల నటించారు. పవిత్ర పాత్రలో కనిపించారు. తొలుత ఆ పాత్రను విలన్ చేసి కార్తీక్ వర్మ దండు కథ రాశారు. కథంతా విన్న సుకుమార్ స్క్రీన్ ప్లే చేంజ్ చేయడంతో పాటు హీరోయిన్ సంయుక్తా మీనన్ పాత్రను విలన్ చేసేశారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో కార్తీక్ వర్మ దండు వెల్లడించారు. సుక్కు మార్క్ మార్పులు ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.


Also Read '2018' రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా - ఎలా ఉందంటే?   



నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'విరూపాక్ష' సందడి!
Virupaksha OTT Release Date : 'విరూపాక్ష' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ (Netflix OTT) సొంతం చేసుకుంది. తమ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు నిర్మాతలు తెలిపారు. మే 21 (ఆదివారం) నుంచి 'విరూపాక్ష' ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 


'స్టార్ మా' చేతికి శాటిలైట్ రైట్స్!
Virupaksha Satellite Rights : 'విరూపాక్ష' శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్వర్క్ 'స్టార్ మా' సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందించారు. 'స్టార్ మా'కు అన్ని భాషల్లో ఛానల్స్ ఉన్నాయి కాబట్టి... ఆ గ్రూప్ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ కావచ్చు.


'విరూపాక్ష'కు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఆయనకు రెండో చిత్రమిది. దీని కంటే ముందు నవదీప్ హీరోగా 'భం బోలేనాథ్' తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో కొన్నాళ్ళు పని చేసి 'విరూపాక్ష' తీశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. బి అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సైతం ప్రశంసలు అందుకుంటున్నాయి.


'విరూపాక్ష' సినిమాలో సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్, సోనియా సింగ్, రవి కృష్ణ, అభినవ్ గోమఠం, యాంకర్ శ్యామల, కామాక్షీ భాస్కర్ల, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరూ పాత్రల పరిధి మేరకు చేశారని పేరు తెచ్చుకున్నారు. 


Also Read టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా - మరీ ఇంత దారుణమా?