యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #KH234 అనే వర్కింగ్ టైటిల్​తో ఈ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా లాంచ్ చేసారు. ప్రారంభోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ‘బిగిన్ ది బిగిన్’ వీడియో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా సరికొత్త అప్డేట్ తో వచ్చారు. నవంబర్ 7న కమల్ బర్త్ డే స్పెషల్ గా, ఒక రోజు ముందుగా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 


''పనిలో కళాత్మకత పెరిగింది... దయచేసి రేపు సాయంత్రం వరకు ఊపిరి పీల్చుకుని వేచి ఉండండి'' అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన వీడియోని వదిలారు. ఇందులో సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయనేది చూపించారు. ఒక లీడర్, ఒక ఐకాన్ కలిసి చేస్తున్న 'KH 234' మూవీ టైటిల్ ను నవంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు వెల్లడించబోతున్నట్లు తెలిపారు.



గతంలో ఉలగనాయగన్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కలయికలో ‘నాయకుడు’ వంటి గ్యాంగ్ స్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. 1987లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాదు, కల్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచిపోయింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఇద్దరు లెజెండ్స్ #KH234 కోసం తిరిగి జతకట్టడం అందరి దృష్టిని ఆకర్షిచింది. ఈసారి వీళ్ళిద్దరూ ఎలాంటి కథతో రాబోతున్నారనే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటారో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 


Also Read: 'బాలీవుడ్ యాక్టర్స్ బాలయ్యను చూసి నేర్చుకోవాలి'.. ఎన్టీఆర్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!


KH234 ను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే కమల్, మణిరత్నంల మ్యాజికల్ కాంబోపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీనికి తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి సన్నాహాలు చేసారు. స్టార్ క్యాస్టింగ్, టాప్ నాచ్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. స్టంట్ మాస్టర్స్ ద్వయం అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు.


రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ఇక ఈ చిత్రంలో త్రిష కథానాయకిగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ తో సహా మిగతా ప్రధాన నటీనటుల వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.


కాగా, 'విక్రమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. మరోవైపు మణిరత్నం సైతం 'పొన్నియన్ సెల్వన్' చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించారు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు మూడు దశాబ్దాల తర్వాత కలిసి చేస్తున్న 'KH 234' చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. 


Also Read: 'ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు'.. అనసూయ షాకింగ్ కామెంట్స్!