బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది. వరుస సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని వెబ్ సైట్స్ చేస్తున్న చెత్త పనులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లు సైతం పూర్తి విషయం తెలుసుకోకుండా ఇతరులను అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.
దిగజారు తనం మానుకోండి- అనసూయ
గత కొంత కాలంగా వ్యూస్ కోసం కొన్ని సోషల్ మీడియా పేజీలు, వెబ్ సైట్లు, కొన్ని మీమ్ పేజెస్, వెబ్‌సైట్స్ తన గురించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అనసూయ మండిపడింది. జనాలు చూడాలని మరీ అంత దిగజారడం మంచిది కాదని హితవు పలికింది. ఇప్పటికైనా మ్యానిప్యులేట్ చేయడం మానుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టింది. ‘‘తలాతోక లేకుండా క్లిక్స్, వ్యూస్ కోసం ఎడిట్ చేసి వీడియోలు పెట్టడం ఆపండి. అయినా, అర్థం చేసుకునే వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, పూర్తి విషయం తెలుసుకునే టైమ్ లేనివారికి ఒక విజ్ఞప్తి. దయచేసి ముందుగా మొత్తం విషయం తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండానే ఎదుటి వారిని అపార్థం చేసుకోకండి. నిజానికి అపార్థం చేసుకోవడం చాలా ఈజీ. కానీ, ఏది వాస్తమో తెలుసుకుని ప్రవర్తించడం అంత తేలిక కాదు” అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది.
మ్యానిప్యులేషన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటున్నారా?- అనసూయ
అటు తన ట్వీట్ కు ఓ నెటిజన్ చేసిన కామెంట్ పైనా అనసూయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “వారు క్రియేటర్స్. తమ ఫాలోవర్స్ ని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటారు” అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. దీనికి అనసూయ గట్టి సమాధానం ఇచ్చింది. “ఒకరి క్యారెక్టర్/హార్డ్ వర్క్/ఫేమ్‌ని పణంగా పెడతారా? వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారో అడగవచ్చా సర్? మ్యానిప్యులేషన్‌ను ఎప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటున్నారు?’’ అని కశ్చన్ చేసింది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానెల్ కు అనసూయ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత అంశాలను ప్రస్తావించింది. అయితే, కొన్ని సోషల్ మీడియా పేజీలు, వెబ్ సైట్స్ అనసూయ గురించి రకరకాల మీమ్స్, ఎడిటెడ్ వీడియోలను పబ్లిష్ చేశాయి. వీటిపై తాజాగా అనసూయ స్పందించింది.
వరుస సినిమాలతో అనసూయ బిజీ
అనసూయ రీసెంట్ గా నటించి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘విమానం’, ‘పెదకాపు 1’, ‘ప్రేమ విమానం’ సినిమాల్లో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది.
Also Read: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial