ఇప్పుడు కన్నడ సినిమా (Kannada Cinema) తలెత్తుకుని నిలబడుతోంది. కన్నడ సినిమా మీద జాతీయ స్థాయిలో ప్రేక్షకుల చూపు పడుతోంది. యశ్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన 'కెజియఫ్', సుదీప్ 'విక్రాంత్ రోణ', రిషబ్ శెట్టి 'కాంతార'  చిత్రాలు కన్నడ చిత్రసీమ స్థాయిని పెంచాయి. దాంతో ఇతర భాషల్లోకి వచ్చే కన్నడ సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ కోవలో వస్తున్న చిత్రమే 'కలివీర'. 


తెలుగులోకి 'కలివీరుడు'గా కన్నడ 'కలివీర'
కన్నడ చలన చిత్రసీమలో రియల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులతో పేరు పొందిన నటుడు ఏకలవ్య (Kannada Hero Ekalavyaa). ఆయన హీరోగా నటించిన తొలి సినిమా 'కలివీర'. ది ఇండియన్ వారియర్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో చిరా శ్రీ హీరోయిన్. కర్ణాటకలో ఈ సినిమా సుమారు రెండేళ్ళ క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 


అవిరామ్ రచన, దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్స్ సంస్థ 'కలివీర'ను నిర్మించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'కలివీరుడు' (Kaliveerudu Telugu Movie) పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ పంపిణీదారుడు, మినిమం గ్యారంటీ మూవీస్ అధినేత ఎం. అచ్చిబాబు దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణాలో ఆయన సంస్థ ద్వారా విడుదల చేస్తున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో ఈ 22న 'కలివీరుడు' విడుదల  
ఈ వారమే 'కలివీరుడు'ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఎం. అచ్చిబాబు చెప్పారు. ఈ నెల 22న... అనగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని మంచి పేరున్న థియేటర్లలో విడుదల చేస్తున్నామన్నారు. తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. 


Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్






ఇంకా 'కలివీరుడు' గురించి ఎం. అచ్చిబాబు మాట్లాడుతూ ''కన్నడలో 'కలివీర' అనూహ్య విజయం సాధించింది. కన్నడసీమలో రికార్డు స్థాయి వసూళ్ళు సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగులో కూడా సంచలన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇది 'కాంతార' తరహా సినిమా. ఇందులో 'కలివీరుడు'గా రియల్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులకు పెట్టింది పేరైన ఏకలవ్య అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన స్టంట్స్ ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు. మరిన్ని కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


Also Read అక్కడ యోగిబాబు, ఇక్కడ సంపూర్ణేష్ బాబు - తెలుగులోకి తమిళ 'మండేలా'



'కలివీరుడు' సినిమాలో డేని కుట్టప్ప, తబలా నాని, అనితా భట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి పోస్టర్స్ : విక్రమ్ ఎ.హెచ్ - అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం : హలేష్ ఎస్, కూర్పు : ఎ.ఆర్.కృష్ణ, నేపథ్య సంగీతం : రాఘవేంద్ర, నిర్మాత : ఎం. అచ్చిబాబు, రచన - దర్శకత్వం : అవి. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial