Jr NTR filed petition in Telangana High Court over his house land controversy in Hyderabad: ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ హీరోకి చెందిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా డెట్ రకవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)లో నలుగుతున్న ఈ గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. అసలు గొడవ ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లారు? అనే వివరాల్లోకి వెళితే...
సుంకు గీత నుంచి 2003లో స్థలం కొన్న ఎన్టీఆర్
Jr NTR House In Hyderabad: జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో సుంకు గీత అనే మహిళ నుంచి 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. అదీ ఇప్పుడు కాదు... 2003లో! ఆ తర్వాత అందులో ఇంటిని కట్టుకున్నారు. అయితే... ఆ స్థలాన్ని తనఖా పెట్టి 1996లో సుంకు గీత తమ దగ్గర రుణాలు తీసుకున్నారని కొన్ని బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రకవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) దగ్గరకు వెళ్లాయి.
స్థలం వివాదంలో ఎవరి వాదనలు ఏమిటి? అనేది చూస్తే... తాను 2003లో ఆ స్థలం కొనుగోలు చేశానని, ప్రభుత్వం నుంచి అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ ఇల్లు కట్టుకున్నానని చెబుతున్నారు ఎన్టీఆర్. అయితే... ఆ స్థలాన్ని సుంకు గీత 1996లో తనాఖా పెట్టి తమ దగ్గ లోన్లు తీసుకున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా చెబుతున్నారు. ఆ బ్యాంకులు అన్నీ కలిసి 'డీఆర్టీ'ని ఆశ్రయించాయి. ఆ కేసులో డీఆర్టీ నుంచి బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తొలుత బ్యాంక్ నోటీసులను సవాల్ చేస్తూ ఎన్టీఆర్ సైతం డీఆర్టీలో పిటీషన్ దాఖలు చేశారు. అయినా బ్యాంకులు అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు.
సుంకు గీతపై పోలీసులకు ఫిర్యాదు
డీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు!
ఇంటి స్థలం విషయంలో డీఆర్టీ నుంచి తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ స్థలం తనకు అమ్మిన సుంకు గీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూ ఎన్టీఆర్. అలాగే, డీఆర్టీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: వివాదంలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ - ఆ పదం వాడినందుకు హైకోర్టు నోటీసులు!
తెలంగాణ హైకోర్టులో ఎన్టీఆర్ వేసిన పిటిషన్ మీద జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జే. శ్రీనివాస్ రావు సభ్యులుగా ఉన్న ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డీఆర్టీ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు కొంత సమయం కావాలని జూ ఎన్టీఆర్ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేస్తూ... కేసుకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు అన్నిటినీ జూన్ 3లోగా కోర్టుకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి స్థలం కొనుగోలు చేసిన విషయంలో ఏకంగా హీరో మోసపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు