John Abraham And Hrithik Roshan Childhood Pic: బాలీవుడ్ యాక్షన్ హీరోలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు.. హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం. వీరిద్దరు నటించిన యాక్షన్ సినిమాలు ఇండియన్ మూవీ లవర్స్ ను ఎంతగానో అలరించాయి. తాజాగా వీరికి సంబంధించిన ఓ పాత ఫోటో బయటకు వచ్చింది. ఈ పిక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వాళ్లు ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే?


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలీవుడ్ స్టార్స్ పిక్


బాలీవుడ్ కు చెందిన ఈ స్టార్ హీరోలు ఒకప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఒకే క్లాస్ మేట్స్ కూడా. వీరిద్దరు స్కూల్లో ఉప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్కూల్ యూనిఫామ్ లో చూడ్డానికి చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో కింది వరుసలో లాస్టులో ఉన్న అబ్బాయి జాన్ అబ్రహాం.  పై వరుసలో ఉన్న వ్యక్తి హృతిక్ రోషన్.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరు ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. వీరిద్దరు క్లాస్ మేట్స్ అయినా, ఏనాడు బయటకు చెప్పుకోకపోవడం విశేషం.






ఇప్పటి వరకు కలిసి నటించని హృతిక్, జాన్ అబ్రహాం


వీరిద్దరు బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నా, ఇంత వరకు కలిసి నటించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘ధూమ్’ సిరీస్ లో వీరిద్దరు నటించారు. అయితే, వేర్వేరు సినిమాల్లో యాక్ట్ చేశారు. 2004లో వచ్చిన ‘ధూమ్’ సినిమాలో జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు. ఇందులో ఆయన కబీర్ అనే పాత్రలో కనిపించాడు. ఇక 2006లో వచ్చిన ‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్ విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి మూడు సినిమాలు రాగా, ఇందులో విలన్స్ మారినా, పోలీసు పాత్రలను మాత్రం అభిషేక్ బచ్చన్ పోషించారు.


వరుస సినిమాలతో హృతిక్, జాన్ బిజీ బిజీ


ఇక 2019లో వచ్చిన ‘వార్’ మూవీలో హృతిక్ రోషన్ కబీర్ అనే సూపర్ స్పై పాత్రలో కనిపించాడు. గతేడాది వచ్చిన ‘పఠాన్’ మూవీలో జిమ్ అనే స్పై పాత్రలో జాన్ అబ్రహం కనిపించాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రాంఛైజీ మూవీస్ చేసినా, కలిసి నటించకపోవడం విశేషం. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత హృతిక్ ‘క్రిష్ 4’లోనూ నటించనున్నాడు. ఇక జాన్ అబ్రహాం ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ‘వేదా’, ‘ది డిప్లొమాట్’, ‘టెహ్రాన్’, ‘తారిఖ్’ చిత్రాలు ఉన్నాయి.  


Read Also: భర్త జ్ఞాపకాల్లో నందమూరి అలేఖ్య- మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్