కథానాయకుడిగా 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రయాణం చాలా భిన్నమైనది. సేఫ్ రూటులో కమర్షియల్ సినిమాలు చేయడం కంటే డిఫరెంట్ / కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి ఆయన ఎప్పుడూ తన వంతు కృషి చేస్తుంటారు. 'ఎవడే సుబ్రమణ్యం'లో చేసిన ప్రధాన పాత్ర కావచ్చు... హీరోగా 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సినిమాలు చేయడం కావచ్చు... తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి విజయ్ దేవరకొండ ఇష్టపడతారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ భారీ ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా హిస్టారికల్ వార్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా అనౌన్స్ చేశారు.
విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ సినిమా!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. 'టాక్సీవాలా' తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. అయితే... ఇది ఆ సినిమా కంటే చాలా భారీగా ఉండబోతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరో విజయ్ దేవరకొండ 14వ సినిమా కావడంతో వీడీ 14 (VD 14 Movie) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మూవీ అనౌన్స్ చేసిన సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై ఓ వీరుడి విగ్రహం చెక్కి ఉంది. ఆ విగ్రహం మీద 'ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్' అని రాశారు. ఆ వీరుడు 1854 నుంచి 1878 వరకు జీవించి ఉన్నట్టు గా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 18వ శతాబ్దం నేపథ్యంలో వాస్తవంగా జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ సినిమా రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది 'బాహుబలి' రేంజ్ సినిమా అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విజయ్ దేవరకొండ, రాహుల్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' విజయాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రమిది. వాళ్లకు హ్యాట్రిక్ కాంబినేషన్ అన్నమాట. అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన ఇతర వివరాల్ని వెల్లడించనున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ మాస్ - నెత్తుటి మడుగులో ఎదిగిన నాయకుడు, పోస్టర్‌తో గూస్ బంప్స్ గ్యారంటీ!
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా గురువారం (మే 9న) 'దిల్' రాజు, శిరీష్ నిర్మాణంలో 'రాజా వారు రాణీ గారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కే రూరల్ యాక్షన్ డ్రామాను కూడా అనౌన్స్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న స్పై థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ విశాఖలో జరుగుతుందని చెప్పారు.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?