Happy Birthday Vijay Deverakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీని వచ్చి, హీరోగా నిలదొక్కుకోవడం చెప్పినంత ఈజీ కాదు. ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే అది సాధ్యమవుతుంది. రౌడీ స్టార్ 'ది' విజయ్ దేవరకొండ ఇదే కోవకు చెందుతాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ లో నటించి.. ఇప్పుడు కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్ తో యూత్ ఐకాన్ గా మారిపోయారు. ప్రస్తుతం సరికొత్త కథలతో ప్రయాణం చేస్తున్న విజయ్ 35వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


⦿ దేవరకొండ గోవర్ధనరావు, మాధవి దంపతులకు 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు దేవరకొండ విజయ్. ఆయన తల్లిదండ్రులు తెలంగాణాలోని ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని తుమ్మన్‌పేట గ్రామానికి చెందినవారు.


⦿ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో విజయ్ చదువుకున్నారు. ఆ సమయంలోనే 'షిర్డీ సాయి పర్తి సాయి దివ్య కథ' అనే సీరియల్ లో బాలనటుడిగా కనిపించారు. 


⦿ హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు విజయ్. బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఆర్ట్స్ కాలేజ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు.


⦿ సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్ లో పాల్గొన్న విజయ్.. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు ప్రదర్శించాడు. ఆ తరువాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఆ టైంలోనే నవీన్ పోలిశెట్టితో పరిచయం ఏర్పడింది.


⦿ 2011లో రవిబాబు దర్శకత్వం వహించిన 'నువ్విలా' చిత్రంతో విజయ్ దేవరకొండ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (2012)లో చిన్న పాత్రలో మెరిశాడు. నాని హీరోగా నాగ్ అశ్విన్ తీసిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో రిషి అనే కీలక పాత్ర పోషించడం ద్వారా నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు.


⦿ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'పెళ్ళి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్. 2016లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పలు అవార్డులు రివార్డులు అందుకుంది. ఇది అతనికి పేరు తెచ్చిపెట్టడమే కాదు, మరిన్ని అవకాశాలను అందించింది.


Also Read: తీరిక లేకుండా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్!


⦿ విజయ్ 2017లో చేసిన 'ద్వారకా' సినిమా ప్లాప్ అయింది. అదే ఏడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ఆయన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాదు, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.


⦿ 'రౌడీ స్టార్' గా పాపులర్ అయిన తర్వాత 'ఏ మంత్రం వేసావే' అనే సినిమా వచ్చి పరాజయం పాలైంది. ఇది 2013లో విడుదల కావాల్సి ఉంది కానీ, 2018లో థియేటర్లలో రిలీజైంది. దీనికి విజయ్ ప్రమోషన్స్ కూడా చెయ్యలేదు.


⦿ 'మహానటి' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించిన విజయ్.. 'గీత గోవిందం' (2018) చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇది అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాతో విజయ్ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. 


⦿ 'నోటా'తో తమిళ మార్కెట్ లోకి ప్రవేశించిన విజయ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదే క్రమంలో వచ్చిన 'ట్యాక్సీవాలా' సినిమా మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందించింది.


⦿ అప్పట్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ 'హీరో' అనే సినిమా అనౌన్స్ చేశారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం మాళవిక మోహనన్‌ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఈ సినిమా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది.


 ⦿ 2019లో విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీ ఫ్లాప్ అయింది. ఇదే తన చివరి లవ్ స్టోరీ అంటూ ప్రకటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా డిజాస్టర్ గా మారింది. కాస్త గ్యాప్ తీసుకొని తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో చేసిన 'లైగర్' మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది.  


⦿ విజయ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్ళిన 'జనగణమ' (JGM) మూవీని పక్కనపెట్టేశారు. అప్పుడెప్పుడో సుకుమార్ తో ప్రకటించిన పాన్ ఇండియా సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.


⦿ గతేడాది వచ్చిన 'ఖుషి' సినిమా కూడా విజయ్ దేవరకొండను ఖుషీ చేయలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.


⦿ విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ యాక్షన్ డ్రామా.. రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు.


⦿ విజయ్ దేవరకొండ 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే బ్యానర్ స్థాపించి, తన తండ్రి పేరు మీదుగా 'మీకు మాత్రమే చెప్తా', 'పుష్పక విమానం' లాంటి సినిమాలు నిర్మించారు. 


Also Read: 'కల్కి'తో ప్రభాస్ 'పాన్ వరల్డ్'కు బాటలు వేస్తాడా?