'ఉయ్యాలా జంపాలా'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma). ఆ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా 'మజ్ను' తీశారు. పదేళ్ళలో విరించి వర్మ తీసిన చిత్రాలు రెండు మాత్రమే! అయినా సరే... ఆ రెండు చిత్రాలకు అభిమానులు ఉన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ తీశారని పేరు తెచ్చుకున్నారు. అటువంటి దర్శకుడు ఒక్కసారిగా రూటు మార్చారు. రొమాంటిక్ లవ్ స్టోరీలను పక్కన పెట్టి... రాజకీయ నేపథ్యం ఉన్న కథను తెరకెక్కిస్తున్నారు. 


విరించి వర్మ దర్శకత్వంలో 'జితేందర్‌ రెడ్డి'!
విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy Movie). హిస్టరీ / హిజ్ స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌.... (ప్రజలకు అతని కథ చెప్పాలి / ప్రజలకు చెప్పాల్సిన చరిత్ర అని అర్థం) అనేది ఉప శీర్షిక. కొన్ని రోజుల క్రితం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. తాజాగా 'జితేందర్ రెడ్డి ప్రమాణం' పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. 


సనాతన ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం!
Jithender Reddy First Look : ''జితేందర్ రెడ్డి అనే నేను ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న నా దేశ గౌరవాన్ని కాపాడతానని... ఈ చరిత్ర నుండి పుట్టిన సనాతన ధర్మ రక్షణ కోసం భరత మాత ఒడిలో నా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని... అమరుల రక్తంతో తడిచిన ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. జైహింద్'' అని హీరో చెబుతున్న వీడియో విడుదల చేశారు. అది చూస్తే... 1985 నేపథ్యంలో కథ సాగుతుందని అర్థం అవుతోంది. అయితే... హీరోగా ఎవరు నటిస్తున్నారు? అనేది చెప్పలేదు. ఈ నెల 21న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.     


Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్



అసలు ఎవరీ 'జితేందర్‌ రెడ్డి'?
'జితేందర్ రెడ్డి'ని ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఆ హీరో ఎవరు? అనేది రివీల్ చేయలేదు. కుర్చీలో ఓ నాయకుడు... ఆయన పక్కన ఓ పాప... ముందు కొంత మంది ప్రజలు... ఇదొక నాయకుని కథ అని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన ప్రమాణం వీడియోలో విజువల్స్ చూస్తే బీడీ కార్మికుల పక్షాన పోరాడే నాయకునిగా చూపించారు.


ముదుగంటి క్రియేషన్స్‌ పతాకంపై ముదుగంటి రవీందర్‌ రెడ్డి 'జితేందర్‌ రెడ్డి'ని ఈ చిత్రానికి విఎస్‌ జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రహకులు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్‌ కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Also Read అక్కడ యోగిబాబు, ఇక్కడ సంపూర్ణేష్ బాబు - తెలుగులోకి తమిళ 'మండేలా'



ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో జితేందర్ రెడ్డి పేరుతో ఓ నాయకుడు ఉన్నారు. ఆయన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ కూడా! అయితే... ఇది ఆయన కథ కాదు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి, ఈ 'జితేందర్ రెడ్డి' ఎవరు? ఆయన కథ ఏమిటి? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial