ఒకప్పుడు బడ్జెట్ విషయంలో నిర్మాతలు చాలా ఆంక్షలు విధించేవారు. ఇంత బడ్జెట్‌లోని సినిమా చేయాలి అంటూ దర్శకులపై ఒత్తిడి ఉండేది. ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం నిర్మాతలు బడ్జెట్ గురించి ఎక్కువగా ఆంక్షలు విధించలేరు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాకు హిట్ టాక్ వస్తే.. లాభాలు కూడా ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. అందుకే షారుఖ్ ఖాన్ తరువాతి చిత్రం ‘జవాన్’కు కూడా ఇలాంటి బడ్జెట్ ఆంక్షలు ఏమీ పెట్టుకోకుండా.. బాలీవుడ్ బాద్‌షా కెరీర్‌లోనే దీనిని కాస్ట్‌లీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘జవాన్’ కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు చూస్తుంటే ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.


‘పఠాన్’కు మించి ఉండాలని..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు లేటెస్ట్‌గా హిట్స్ ఉన్నా లేకపోయినా.. తన ఒక సినిమా బడ్జెట్‌కు మించి మరొక సినిమా బడ్జెట్ ఉంటుంది. ఇంతకు ముందు ఆయన సినిమాపై ఖర్చు పెట్టలేరు అని ప్రేక్షకులు అనుకుంటున్న ప్రతీసారి.. నిర్మాతలు వారిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. షారుఖ్ చివరి చిత్రం ‘పఠాన్’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పుడు ‘జవాన్’ దానికి మించి ఉంటుందని సమాచారం. ‘జవాన్’ అనేది ప్రతీ అంశంలో పర్ఫెక్ట్‌గా ఉండాలని.. ఈ మూవీకి సంబంధించిన నిర్మాణ బాధ్యతలు కూడా షారుఖ్.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంటే స్వీకరించింది. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కలిసి తమ సొంత బ్యానెర్‌లోనే నిర్మిస్తున్నారు. అందుకే ‘జవాన్’ బడ్జెట్ విషయంలో షారుఖ్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది.


‘జవాన్’ కోసం రూ.300 కోట్లు..
ఇప్పటికే ‘జవాన్’ కోసం నిర్మాతగా షారుఖ్ ఖాన్ పెట్టిన ఖర్చు రూ.300 కోట్లని తెలుస్తోంది. అంటే ఏ విధంగా చూసినా.. ఇది షారుఖ్ కెరీర్‌లోనే కాస్ట్‌లీ ఫిల్మ్. ‘పఠాన్’ అనేది ఇండియాలోనే యాక్షన్ సినిమాలను వేరే లెవెల్‌కు తీసుకువెళుతుందని షారుఖ్ నమ్మారు.. ఆయన అనుకున్నట్టుగానే ‘పఠాన్’ ఒక రేంజ్‌లో హిట్ అందుకుంది. ఇప్పుడు ‘జవాన్’ను అంతకు మించిన హిట్ చేయాలని షారుఖ్ పట్టుదలతో ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. ‘పఠాన్’ విషయంలో యాక్షన్ సీన్స్ అన్నీ చాలా నేచురల్‌గా కనిపించడం కోసం టీమ్ చాలా కష్టపడింది. గ్రీన్ మ్యాట్ సెటప్ కంటే లైవ్ లొకేషన్స్‌లో ఎక్కువగా షూట్ చేయడానికి ప్రయత్నించారు. దీని వల్ల సినిమా మరింత లేట్ అవ్వడం, దాని వల్ల బడ్జెట్ పెరగడం లాంటివి జరిగాయి. దాని వల్ల నిర్మాతలు మొదట్లో ఇబ్బందిపడినా.. ఔట్‌పుట్ చూసిన తర్వాత మాత్రం తృప్తిచెందారు.


అట్లీపైనే భరోసా..
తమిళ దర్శకుడు అట్లీని నమ్మి ‘జవాన్’ కోసం భారీగానే ఖర్చుపెడుతున్నాడు షారుఖ్. కానీ ఇప్పటికే విడుదలయిన టీజర్, గ్లింప్స్‌ చూస్తే అట్లీని షారుఖ్ నమ్మడంలో తప్పేమి లేదు అనిపించేలా ఉన్నాయి. దాంతో పాటు షారుఖ్, నయన్ ఫ్రెష్ పెయిర్. అనిరుధ్ మ్యూజిక్.. ఇలా పలు అంశాలు ఇప్పటికే ‘జవాన్’పై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. అందుకే బడ్జెట్ రూ.300 కోట్లు అయినా ప్రపంచవ్యాప్తంగా అంతకు మించి కలెక్షన్స్ సాధించి హిట్‌ను సొంతం చేసుకునే సత్తా ‘జవాన్’కు ఉందని షారుఖ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలకానుంది.


Also Read: జపాన్‌కు చేరిన ‘జైలర్’ క్రేజ్ - ‘కావాలా’ అంటూ స్టెప్పులేసిన అంబాసిడర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial