ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విడిపోతే.. ప్రపంచమంతా అసలు నిజానిజాలు తెలుసుకోకుండా అమ్మాయిదే తప్పని నిందలు వేస్తారు. బయట మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో కూడా ఇదే తంతు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్స్ చాలా తక్కువ. అందులో కూడా ఇప్పటికీ కలిసున్న వారి సంఖ్య అయితే మరీ తక్కువ. అలా ప్రేమించి, పెళ్లి చేసుకొని , విడిపోయిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ జంట కూడా ఒకటి. వీరు విడిపోయిన దగ్గర నుండి పవన్ ఫ్యాన్స్, హేటర్స్.. ఇలా చాలామంది రేణును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి కామెంట్స్‌పై ఇప్పటికే రేణూ చాలాసార్లు స్పందించగా.. మరోసారి తన భావాలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.
నా జీవితానికి అర్థం ఇదే..
తాజాగా సోషల్ మీడియాలో రేణూ దేశాయ్.. ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ సమాజానికి కావాల్సిన వ్యక్తి అని, తనకు ఓటు వేయండి అంటూ పవన్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. దాని వల్ల పవన్ హేటర్స్ అంతా ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా ‘‘అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని, తరిమేశాడు’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యింది. ‘‘నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి లభించిందా? లేదంటే ఇంకా చెప్పండి. నా మాజీ భర్తను ఫాలో అయ్యేవారు లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ల దగ్గర నుంచి తిట్లు వినడం మాత్రమే నా జీవితానికి అర్థం. కానివ్వండి’’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నెటిజన్ చేసిన కామెంట్‌ను, దానికి ఆమె ఇచ్చిన రిప్లైను రేణూ.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు తన మనసులోని మాటలను కూడా బయటపెట్టింది.
నా తలరాత ఇంతేనేమో..
‘‘నేను విడాకుల గురించి, నా మాజీ భర్త చేతిలో ఎలా మోసపోయాను అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు తన ఫ్యాన్స్ నన్ను వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఒక పౌరురాలిగా ఆయనకు సపోర్ట్‌గా నిజం మాట్లాడితే.. ఆయన హేటర్స్ నన్ను వేధిస్తున్నారు. ఒకప్పుడు విడాకుల గురించి మాట్లాడడానికి డబ్బు తీసుకున్నానని హేటర్స్ అనేవాళ్లు. ఇప్పుడు కూడా డబ్బు తీసుకునే మట్లాడుతున్నానని ఆయన అభిమానులు అంటున్నారు. నేను రెండు సందర్భాల్లో నిజం తప్పా ఇంకేమీ మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు, నిజాలు మాట్లాడినందుకు ఇదంతా అనుభవించక తప్పదేమో. ఒకవేళ ఇదే నా తలరాత ఏమో. ఇంకా వేధింపులు మొదలుపెట్టండి’’ అంటూ రేణూ దేశాయ్.. ఓవైపు పవన్ అభిమానులతో పాటు తనను ద్వేషించే వారికి కూడా గట్టిగా సమాధానమిచ్చింది. తనను ఎంత వేధించినా తాను ఇంక పట్టించుకోనని తెగించి చెప్పేసింది.
పవన్, రేణూ ప్రయాణం..
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలిసి ‘బద్రి’ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడి.. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం చేశారు. అదే సమయంలో తమకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యి రెండేళ్లు కూడా కలిసి జీవించలేదు. విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. అప్పటికే పవన్ కళ్యాణ్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో అసలు విడాకులకు కారణమేంటో తెలుసుకోకుండా రేణూ.. తన అభిమాన హీరోను మోసం చేసిందంటూ ఫ్యాన్స్ తనను వేధించడం మొదలుపెట్టారు. అందుకే కొన్నాళ్ల పాటు అందరికీ దూరంగా జీవించింది రేణూ. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వగా ఇప్పటికీ తనకు వేధింపులు తప్పడం లేదు. కొంతమంది మాత్రం రేణూ తప్పేమీ లేదంటూ సపోర్ట్ చేస్తుంటే.. చాలామంది మాత్రం తనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్‌ను చూసి వదిలేయకుండా రేణూ దేశాయ్ కూడా ఎప్పటికప్పుడు ఘాటుగానే స్పందిస్తుంది.
Also Read: ‘సుట్టంలా సూసి’ లిరికల్ వీడియో విడుదల - గ్లామర్ డోస్ పెంచేసి నేహా శెట్టి స్టెప్పులు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial