మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో 'ధృవ'చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2016లో స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు 'గోవిందుడు అందరివాడేలే' 'బ్రూస్ లీ: ది ఫైటర్' వంటి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో రేసులో కాస్త వెనుకబడిపోయిన చెర్రీ కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ఈ మూవీ తమిళ్ లో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది.


'జ‌యం' ర‌వి హీరోగా, ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తని ఒరువన్'. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఈ మూవీ 2015 ఆగస్టు 28న థియేటర్లలో రిలీజ్ అయింది. అంటే ఈ నెల 28వ తేదీకి సినిమా వచ్చి 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అదే రోజున 'తని ఒరువన్ 2' ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


Read Also: కింగ్ బర్త్ డే స్పెషల్ గా 'మన్మథుడు' మళ్ళీ వస్తున్నాడు!


'తని ఒరువన్' సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శక హీరోల ద్వయం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 'గాడ్ ఫాదర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో 'తని ఒరువన్ 2' గురించి మాట్లాడారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావొచ్చిందని, త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు స్టోరీ లైన్ రామ్ చరణ్ కు కూడా బాగా నచ్చిందని, తెలుగులో 'ధృవ 2' ఉంటుందో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుందన్నారు. 


అలానే 'స్వప్న సుందరి' మూవీ ట్రైలర్ లాంచ్‌లో, దర్శకుడు మోహన్ రాజా 'థని ఒరువన్ 2' గురించి మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం ఉంటుందని చెప్పారు. మరోవైపు జయం రవి కూడా 'పొన్నియన్ సెల్వన్' ప్రమోషన్స్ లో తన సీక్వెల్ మూవీ గురించి నోరు విప్పారు. సరైన సమయంలో అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందని, 'తని ఒరువన్' విడుదలై 8 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ నెలాఖరున అధికారిక ప్రకటన ఉంటుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 


జయం రవి 'తని ఒరువన్ 2' చిత్రాన్ని ఎప్పుడు పట్టాలెక్కించినా, అదే ప్రధాన తారాగణంతో చేస్తారా? లేదా వేరే నటీనటులతో సెట్స్ మీదకు తీసుకెళ్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలానే తెలుగులో రామ్ చరణ్ తో 'ధృవ 2' సినిమా ఉంటుందా లేదా?.. ఒకవేళ 'ధృవ' కి సీక్వెల్ చెయ్యాలని భావిస్తే, సురేందర్ రెడ్డి - మోహన్ రాజాలలో ఎవరు దర్శకత్వం వహిస్తారు? అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటన్నింటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. 


ఇకపోతే నిర్మాత ఎడిట‌ర్ మోహ‌న్ కుమారులైన జయం రవి, మోహన్ రాజాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రవి తెలుగులో 'బావా బావమరిది' 'పల్నాటి పౌరుషం' సినిమాలలో నటించాడు. ప్రస్తుతం హీరోగా డబ్బింగ్ చిత్రాలతో అలరిస్తున్నాడు. మరోవైపు మోహన్ రాజా 2001 లో 'హనుమాన్ జంక్షన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తెలుగులో హిట్టైన 'జయం' 'అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి' 'బొమ్మరిల్లు' 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' 'ఆజాద్' 'కిక్' వంటి చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేసి  రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో 'గాడ్ ఫాదర్' వంటి రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించారు. 


Also Read: 'లవ్ గురు' ఫస్ట్ లుక్ - రోమియోగా మారిన బిచ్చగాడిని చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial