కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలోని ‘కావాలా’ పాట అంతర్జాతీయంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ ట్యూన్‌కు తమన్నా ఎనర్జిటిక్ స్టెప్స్ తోడవడంతో ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది. ‘కావాలా’ హుక్ స్టెప్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెలరేగిపోతున్నారు.


ఇప్పుడు తాజాగా భారతదేశంలో జపాన్ అంబాసిడర్ కూడా ‘కావాలా’ స్టెప్‌కు కాలు కదిపారు. జపనీస్ అంబాసిడర్ హిరోషి సుజుకి, ప్రముఖ యూట్యూబర్ మాయో సాన్ ఈ పాటకు డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను హిరోషి సుజుకి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. రజనీకాంత్‌పై తన ప్రేమ అలా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. 






మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘జైలర్’ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్కును దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ‘జైలర్’ సాధించడం విశేషం. ఇప్పటికే బ్రేక్ఈవెన్ మార్కును దాటిన ‘జైలర్’ బయ్యర్లకు భారీ లాభాలు అందించే దిశగా సాగిపోతుంది.


‘జైలర్’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించారు. తెలుగు నుంచి ఒక స్టార్ హీరో లేని వెలితి కనిపించింది. అయితే ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రకు నటసింహం నందమూరి బాలకృష్ణను తీసుకుందామని నెల్సన్ అనుకున్నారట. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ క్యారెక్టర్‌ను తాను సరిగ్గా రాయలేకపోయానని, అందుకే బాలకృష్ణను అప్రోచ్ కాలేదని అన్నారు. కానీ భవిష్యత్తులో బాలకృష్ణతో కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.


ఒకవేళ ఈ పాత్ర సెట్ అయి నటసింహం నందమూరి బాలకృష్ణ చేసి అది వేరే లెవల్‌లో ఉండేది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా నడిచి వస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. అనిరుథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో నందమూరి బాలకృష్ణను చూసిన ఆనందం ఫ్యాన్స్‌కు ఉండిపోయేది. కానీ కొంచెంలో ఆ ఫీల్ మిస్ అయింది.


ఈ సినిమా ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనాన్ని రేపాయి. ‘జైలర్’ ఆడియో లాంచ్ స్పీచ్ లో రజినీకాంత్ మాట్లాడుతూ తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా తాను అస్సలు పట్టించుకోనని చెప్పారు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఈ స్పీచ్‌లో వివరించారు. "మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా, మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా" అని నవ్వుతూ చెప్పారు. ఆయన మాటలకు ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులు విజిల్స్ కొట్టారు. అయితే ఈ వ్యాఖ్యలను సూపర్ స్టార్ రజనీకాంత్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేశారని కొంత మంది సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.