Medical College Student Suicide: మంగళగిరి పరిధిలోని ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఫీజు వేధింపుల గురించి విశ్వ విద్యాలయ అధికారులకు చేసిన ఫిర్యాదు కాపీ యశ్వంత్ ఆత్మహత్య అనంతరం వెలుగులోకి వచ్చింది. 


యాజమాన్యంపై ఆరోపణలు... 
యశ్వంత్ ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు ( ఎం వి రావు) అదనంగా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయటంతోనే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు యాజమాన్యం నుంచి ఎదురవుతున్న అదనపు ఫీజు చెల్లింపు వేధింపులపై రెండు నెలల కిందటే యశ్వంత్ విజయవాడలోని ఎన్ టి ఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులతో పాటు, ఎన్ ఆర్ ఐ కళాశాల అధికారులకు లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని చెపుతున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయాన్ని యశ్వత్ తీసుకున్నారని సమాచారం. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపుల గురించి విశ్వ విద్యాలయ అధికారులకు చేసిన ఫిర్యాదు కాపీ యశ్వంత్ ఆత్మహత్య అనంతరం వెలుగులోకి వచ్చింది. 


ఏడాదికి 33 లక్షలు... 
2019లో ఎన్ ఆర్ ఐ కళాశాలలో వైద్య విద్య చదివేందుకు మేనెజ్మెంట్ కోటాలో చేరిన యశ్వంత్ ప్రతి సంవత్సరం నిర్దేశించిన గడువులోగా ముందుగా నిర్ణయించిన 33 లక్షల రూపాయల ఫీజు చెల్లిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఏడాదికి సంబందించిన ఫీజు 33 లక్షల రూపాయలు ఏప్రియల్ 12వ తేదీన చెల్లించినట్లు లేఖలో ఉంది. అయితే కళాశాల అధికారులు అదనంగా మరో 12 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారని లేఖలో ప్రస్తావించాడు. ఈ మొత్తం చెల్లిస్తే ఫీజు ఏడాదికి చాలా ఎక్కువ అవుతుందని... అంత మొత్తం చెల్లించలేనని నిస్సహాయత వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ కు తెలియచేశానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించానని ఇక అదనపు చెల్లింపు తనవల్ల కాదని చెప్పినా వినకుండా ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందు అవమానించే విధంగా అవహేళన చేశారని లేఖలో తెలిపారు.


ఫీజు విషయమై కళాశాల అడ్మినిస్ట్రేటర్ తో మాట్లాడాల్సిందిగా ప్రిన్సిపాల్ చెప్పారని, అదే సమయంలో అడ్మినిస్ట్రేటర్ ఆదేశాలతో తనపై చర్యలకు ప్రిన్సిపల్ ఉపక్రమించారని తెలిపారు. ఫీజు మొత్తము చెల్లించిన తనపై ప్రిన్సిపల్ చర్య తీసుకోకుండా తీసుకోకుండా చూడాలని అభ్యర్ధించేందుకు అడ్మినిస్ట్రేటర్ ఎం వీ రావు ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఈ లేఖలో యశ్వంత్ తన ఆవేదనను విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపారు. తనపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కళాశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని, తాను శ్రద్ధగా చదువుకోనివ్వకుండా మానసికంగా వేధిస్తూ తన భవిష్యత్తును సరిద్దిదుకోలేని విధంగా నష్టం చేస్తున్న, వేధిస్తున్న ఎన్ ఆర్ ఐ కళాశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో యశ్వంత్ విశ్వ విద్యాలయ అధికారులను కోరారు.


తనను వేధించకుండా, తనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో యశ్వంత్ అభ్యర్ధించారు. ఈ లేఖ ప్రతిని యశ్వంత్ విశ్వవిద్యాలయ అధికారులతో పాటు, కళాశాల అడ్మినిస్ట్రేటర్, ప్రిన్సిపల్ కు ఈ ఏడాది జూన్ 23న పంపారు. వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవటంతో యశ్వంత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని సన్నిహితులు చెప్తున్నారు.