కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో తెరకెక్కించిన 'జవాన్' ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీలో షారుక్ ని వివిధ గెటప్స్ లో చూపించి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు అట్లీ. ఓ సౌత్ డైరెక్టర్ షారుక్ ఖాన్ లాంటి బడా స్టార్ తో సినిమా తీసి ప్రశంసలు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ జర్నీ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.. 1986 సెప్టెంబర్ 21న తమిళనాడులో ఓ గ్రామంలో జన్మించిన అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. సంచల దర్శకుడు శంకర్ దగ్గర 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
ఆ తర్వాత 2011లో 'మూగపుతగమ్' అనే షార్ట్ ఫిలిం తీసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ షార్ట్ ఫిలిం రెస్పాన్స్ తో మరో అడుగు ముందుకేసి సినిమాకి శ్రీకారం చుట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అట్లీ 'రాజా రాణి' కథను రాసుకున్నారు. ఆర్య, జై, నయనతార, నజ్రియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2013లో తమిళం తో పాటు అదే టైటిల్తో తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రూ.25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.84 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా కోలీవుడ్కు చెందిన 'విజయ్' అవార్డు అందుకున్నారు అట్లీ. ఇక 'రాజారాణి' తర్వాత దళపతి విజయ్తో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు. అందులో మొదట తీసిన 'తేరి' 2016 లో విడుదలైంది. 'పోలీసోడు' పేరుతో తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఆకట్టుకుంది.
రూ. 75 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అట్లీకి 'సైమా' పురస్కారం దక్కింది. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ 'మెర్సల్'. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, సమంత, SJ సూర్య కీరోల్స్ ప్లే చేసిన ఈ మూవీ 'అదిరింది' టైటిల్ తో తెలుగులో కూడా అదరగొట్టింది. సుమారు రూ.120 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కూడా బెస్ట్ డైరెక్టర్ గా 'సైమా' అవార్డు అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన జోనర్ ను కాస్త మార్చి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ని ఎంచుకొని విజయ్తో 'బిగిల్' రూపంలో మరో విజయాన్ని సాధించారు. నయనతార కథానాయక నటించిన ఈ చిత్రం తెలుగులో 'విజిల్' పేరుతో విడుదలై మంచి విజయం అందుకుంది.
రూ.180 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.280 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇలా నాలుగు సినిమాల అనుభవంతోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ డైరెక్ట్ చేసే అవకాశం అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు అట్లీ. తన కెరియర్ లో షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ తో పని చేయడం చాలా తక్కువ. మణిరత్నంతో 'దిల్ సే', కమలహాసన్ తో 'హే రామ్' తర్వాత ఆ అవకాశం అట్లీ కి మాత్రమే దక్కింది. అలా షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమాను తెరకెక్కించగా, సెప్టెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో షారుక్ ని ఎవరూ చూపించని మాస్ గెటప్స్ లో చూపించి అదరగొట్టేసారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఈ విషయంలో అట్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్లో 'జవాన్' అట్లిని డైరెక్టర్గా మరో స్థాయికి తీసుకెళ్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : లావణ్యా త్రిపాఠికి జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ - పెళ్లికి ముందు ఆ సిరీస్ కంప్లీట్ చేయాలని!
సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ హిందీ తో పాటు తమిళం, తెలుగులో విడుదలైన అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ని అందుకుంది. నిజానికి తన కెరియర్ స్టార్టింగ్ లోనే అట్లీ షారుక్ ఖాన్ ని ఓసారి ముంబై వెళ్లి కలవాలనుకున్నారట. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో షారుక్ ఇంటి ముందు ఫోటో దిగి తిరిగి చెన్నై వచ్చేసారట. ఈ విషయాన్ని జవాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గుర్తు చేసుకున్నాడు అట్లీ.." అప్పట్లో షారుక్ సార్ ని కలవలేకపోయా. కానీ జవాన్ సినిమా కథ వినిపించేందుకు కారులో ఆ ఇంటికి వెళ్ళా. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను" అని అట్లీ అన్నారు. బహుశా సక్సెస్ అంటే ఇదేనేమో. ఇక జవాన్ తో 5 విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అట్లీ తన 6 వ సినిమాని ఏ హీరోతో తెరకెక్కిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల కామెడీ టైమింగ్ అదుర్స్ - 'రూల్స్ రంజన్' ట్రైలర్ వచ్చేసింది