తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారత్ సహా పలు దేశాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. జపాన్, సింగపూర్, మలేషియాలో ఆయనకు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. భారత్ తో పాటు అక్కడ కూడా ఆయన సినిమాలకు అద్భుత ఆదరణ ఉంటుంది. ఆయన స్టైలిష్ నటనకు అభిమానులు ఇట్టే మంత్ర ముగ్ధులవుతారు. పెద్ద వయసులోనూ కుర్ర హీరోల మాదిరిగా నటిస్తూ రోజు రోజుకు అభిమానులను పెంచుకుంటూనే పోతున్నారు.


‘జైలర్’ మూవీ కోసం చెన్నైకి వచ్చిన జపనీస్ జంట


తాజాగా ఆయన నటించిన ‘జైలర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆయన అభిమానులు ఈ సినిమా చూసి మురిసిపోతున్నారు. ఈ  సినిమాను చూసేందుకు ఏకంగా చెన్నైకి వచ్చింది ఓ జపనీస్ జంట. ఒసాకాకు చెందిన యసుదా హిడెతోషి, తన భార్యతో కలిసి ‘జైలర్’ మూవీ చేసేందుకు చెన్నైకి చేరుకున్నారు. చెన్నైలోని ఓ థియేటర్ లో తమిళ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. యసుదా జపాన్‌లోని రజినీ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. చెన్నైలో రజనీ మేనియా చూసి ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు.    


ఇక ‘జైలర్’ మూవీని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌ కుమార్‌ ‘జైలర్’ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఇవాళ(గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.  ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.  ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా, దేశ వ్యాప్తంగా 6 లక్షలకుపైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి.


సంచలనం కలిగించిన రజనీ వ్యాఖ్యలు   


తాజాగా ‘జైలర్’ ఆడియో రిలీజ్ స్పీచ్ లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా హీట్ రేపాయి. తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా పట్టించుకోనని రజనీ చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. "మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా, మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా" అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు ప్రేక్షకులు కరతాళధ్వనులతో మద్దతు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలను రజనీకాంత్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేశారని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.






Read Also: చిరంజీవిపై ఏపీ సర్కారు కక్షసాధింపు? ఆ కారణాలతోనే ‘భోళా శంకర్‘ టికెట్ ధరల పెంపుకు నిరాకరణ?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial