మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపొందుతోంది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రేపు(ఆగష్టు11న) ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరల పెంపుకు  ఏపీ సర్కారు అనుమతి ఇవ్వదనే టాక్ నడుస్తోంది. 

      


ఆధారాలు సమర్పిస్తే అవకాశం ఇస్తాం!


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏపీ సర్కారు ఓ ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి సర్కారు నిర్ణయించిన సుమారు 11 పత్రాలను చిత్ర నిర్మాతలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికీ ఇవి తమకు అందలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి అనుమతి లేనట్లేనని వెల్లడించింది. రూ. 100 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతలు చెప్పినా, అవసరమైన పత్రాలను ఇవ్వలేదని తెలిపింది. అంతేకాదు, ఏపీలో ఈ సినిమా షూటింగ్ 20 శాతం కొనసాగినట్లు ఆధారాలు ఇవ్వలేదని చెప్పింది. పూర్తి వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.  


టిక్కెట్ ధరల విషయంలో ఏపీ సర్కారు  పారదర్శకంగా ఉంది- సజ్జల


‘భోళాశంకర్’ సినిమా టికెట్ల ధరలకు సంబంధించి  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సినిమా ఈవెంట్లలో పాల్గొనే వ్యక్తులు సినిమాకి సంబంధించిన విషయాల గురించి కాకుండా రాజకీయాల గురించి మాట్లాడ్డం మంచిది కాదన్నారు.  టిక్కెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు.  సినీ రంగానికి సంబంధించి ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లు చూపించి టిక్కెట్టు ధరలను పెంచుకోవచ్చని సూచించారు.   గతంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాకు టికెట్ ధరలు  పెంచుకునే వెసులుబాటును కల్పించినట్లు గుర్తు చేశారు.  అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను  ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని తెలిపారు. ఇప్పుడు భోళా శంకర్‌ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదని చెప్పారు. కాబట్టే టిక్కెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించలేదన్నారు.


కక్ష సాధింపులో భాగంగానే ధరల పెంపుకు అవకాశం ఇవ్వలేదా?


ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ‘భోళా శంకర్’ టికెట్ల ధర పెంపుకు సంబంధించి అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లు గరిష్టంగా ₹177 టిక్కెట్‌ను విక్రయించనుండగా, మల్టీప్లెక్స్‌లు ₹295 వసూలు చేసుకునే అవకాశం ఉంది. ఈ మధ్య ఏపీ సర్కారు సినిమా పరిశ్రమ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.  ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు అదే కోపంతో ‘భోళాశంకర్’ సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.  


Read Also: ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్: యజమానిని చూసి తోక ఊపే కుక్కలాంటిది ఈ కోథా - అదరగొట్టేసిన దుల్కర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial