విశ్వ నటుడు కమల్ హాసన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కలిసి పలు సినిమాలు చేశారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. రీసెంట్ ఇద్దరూ కలిసి అమెరికాకు వెళ్లారు. లాస్ ఏంజిల్స్ లోని ఆస్కార్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘ది గాడ్ ఫాదర్’(1972)ను తిలకించారు. ఇక 81వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’(2008) చిత్రానికి గాను రెహమాన్ రెండు అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఆయన అప్పట్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ నాటి సంగతులను కమల్ తో పంచుకున్నారు. ఆస్కార్ మ్యూజియాన్ని సందర్శించిన ఫోటోలను కమల్, రెహమాన్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
మణిరత్నం సినిమా కోసం పని చేస్తున్న కమల్, రెహమాన్
ప్రభాస్ హీరోగా, నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ‘కల్కి 2898 AD’ సినిమా కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ రీసెంట్ గా అమెరికాలో జరిగింది. ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ కమల్ హాసన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
అప్పట్లోనే హాలీవుడ్ సినిమా చేయాలని చెప్పా- రెహమాన్
“కమల్ హాసన్ ఆరు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ చాలా సినిమాలు చూస్తారు. వాటిలోని సీన్లను, డైలాగులను ఈజీగా గుర్తుంచుకుంటారు. నేను 20 ఏళ్ల క్రితమే కమల్ హాసన్ కు ఓ సలహా ఇచ్చాను. అప్పుడు తన దగ్గర డబ్బు బాగా ఉంది. ఆ సమయంలో హాలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమా చేయాలని చెప్పాను. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకూడదు అన్నాను. కేవలం అదో ప్రయోగంలా భావించాలని చెప్పా. ఆయన తలుచుకుంటే ఇప్పటికీ నేను చెప్పిన విషయాన్ని నిజయం చేయగలరు” అన్నారు.
చెన్నై అంటే ఎంతో ఇష్టం- రెహమాన్
ఇక తనకు చెన్నై అంటే ఎంతో ఇష్టం అన్నారు రెహమాన్. ఆ నగరాన్ని వదిలి ఇతర ప్రాంతంలో నివసించాలని అసలు ఊహించలేనని చెప్పారు. “నేను చెన్నైకి చెందిన వ్యక్తి అనే భావన ఎప్పుడూ ఉంటుంది. నా ఫ్యామిలీకి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. మా స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. అందుకే, ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్లాలనే ఆలోచన రాలేదు. రాదు కూడా” అని చెప్పారు. ఇక “నాకు సరదాగా ఉండే పనులు మాత్రమే చేస్తాను. ఒత్తిడిలో పని చేస్తున్నట్లు అనిపించినా, నా పని పట్ల సంతృప్తి చెందనట్లు అనిపించినా, త్వరగా వదిలించుకునే ప్రయత్నం చేస్తాను. డబ్బుకన్నా, మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావిస్తాను” అన్నారు రెహమాన్.
Read Also: ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial