RBI MPC Meeting Results Today: దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయో, లేదో అన్న విషయం కాసేపట్లో తెలిసిపోతుంది. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ ప్రకటిస్తుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ మీటింగ్‌ ఈ నెల 8న ప్రారంభమై ఈరోజు (ఆగస్టు 10) ముగుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) ఏ నిమిషంలోనైనా లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.


ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మూడో ఎంపీసీ మీటింగ్‌ ఇది. ఈసారి కూడా రెపో రేట్‌లో (Repo Rate) ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుత రేటు 6.50 శాతం వద్దే దానిని ఆర్‌బీఐ ఉంచుతుందని చాలా మంది ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అయితే, దేశంలో ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్‌ భారతదేశ GDP వృద్ధికి కొంత అవరోధంగా మారవచ్చు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ డెసిషన్‌ ఉంటుంది.


రెపో రేట్‌ పెరిగితే ఏం జరుగుతుంది?
రెపో రేట్‌ అంటే, దేశంలోని వాణిజ్య బ్యాంకులకు సెంట్రల్‌ బ్యాంక్‌ (RBI) ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేట్‌ పెరిగితే బ్యాంకులపై భారం పెరుగుతుంది. ఆ భారాన్ని అవి కస్టమర్ల మీదకు నెడతాయి. అంటే, దేశంలోని బ్యాంకులు కూడా, తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, రెపో రేట్‌ పెరిగితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయి, రెపో రేట్‌ తగ్గితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీనికి అనుగుణంగా ప్రజలపై ప్రభావం పడుతుంది.


2022-23 ఆర్థిక సంవత్సరంలో, RBI మొత్తం ఆరు సార్లు రెపో రేటును పెంచింది. ఈ ఆరు దఫాల్లో కలిపి మొత్తం 2.50 శాతం (250 బేసిస్‌ పాయింట్లు) పెంచింది, రెపో రేటును 4,00 శాతం నుంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు (ఏప్రిల్‌, జూన్‌) క్రెడిట్ పాలసీ మీటింగ్స్‌లోనూ రెపో రేట్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఎలాంటి మార్పు చేయలేదు. 


తేదీ                             రేపో రేటు          మార్పు (బేసిస్‌ పాయింట్లు)
08-జూన్‌-2023               6.50%                   0
06-ఏప్రిల్‌-2023             6.50%                   0
08-ఫిబ్రవరి-2023           6.50%                  25
07-డిసెంబర్‌-2022        6.25%                   35
30-సెప్టెంబర్‌-2022        5.90%                  50
05-ఆగస్టు-2022              5.40%                  50
08-జూన్‌-2022               4.90%                   50
04-మే-2022                   4.40%                   40
09-అక్టోబర్‌ 2022            4.00%                   0


మీ EMI మీద ఎఫెక్ట్‌ ఉండకపోవచ్చు
ఆర్‌బీఐ, కీలక రేట్లను (Repo Rate) మార్చకపోతే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచవు. ఫలితంగా, బ్యాంక్‌ EMIల మీద కూడా భారం పెరగదు, ఉపశమనం ఉంటుంది. అయితే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్‌ చేయడానికి రెపో రేట్‌ పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయిస్తే మాత్రం బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయి. దాంతోపాటే EMIల భారమూ పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Natco, Hero, LIC, Suzlon


Join Us on Telegram: https://t.me/abpdesamofficial