'జైలర్' సినిమాలో విలన్ రోల్ చేసిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan) గుర్తు ఉన్నారా? ప్రేక్షకులు ఇప్పట్లో ఆయనను మర్చిపోవడం కష్టమే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోయిజం ముందు వినాయకన్ చూపించిన విలనిజం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'జైలర్' విజయంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పాపులర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం... పోలీస్ కేసు! పూర్తి వివరాల్లోకి వెళితే... 


మద్యం మత్తులో గొడవ చేసిన వినాయకన్
వినాయకన్ మలయాళీ. కేరళలోని ఎర్నాకుళంలో ఉంటున్నారు. మద్యం సేవించి అపార్ట్మెంట్ వాసులకు సమస్యలు కలిగించిన ఘటనలో ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషనుకు తీసుకు వచ్చిన తర్వాత కూడా వినాయకన్ గొడవ చేశారని సమాచారం. దాంతో కొచ్చికి ఆయనను షిఫ్ట్ చేశారట. 


ప్రస్తుతం కేరళ పోలీసుల అధీనంలో వినాయకన్ ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 


'జైలర్' విజయాన్ని ఊహించలేదు
'జైలర్' విడుదలైన తర్వాత ఇంత ఘన విజయం సాధిస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని వినాయకన్ చెప్పారు. సినిమా గ్రాండ్ సక్సెస్ గురించి ఆయన మాట్లాడుతూ ''మా సినిమాలో ఓ డైలాగ్ ఉంది కదా! 'కలలో కూడా ఊహించకండి' అని! ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే'' అని చెప్పారు. 'జైలర్' కంటే ముందు ఓ తమిళ సినిమాలో వినాయకన్ నటించారు. విశాల్ 'తిమిరు' (తెలుగులో 'పొగరు' పేరుతో విడుదల అయ్యింది)లో ఆయన విలన్ రోల్ చేశారు.


త్వరలో విక్రమ్ 'ధ్రువ నక్షత్రం'లోనూ...
'జైలర్' కంటే ముందు తమిళంలో వినాయకన్ ఓ సినిమా చేశారు. అది విడుదల కావడం ఆలస్యం అయ్యింది. అదే చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ధ్రువ నక్షత్రం' (Dhruva Natchathiram). మంగళవారం ఆ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ రోజే వినాయకన్ అరెస్ట్ అయ్యారు.


Also Read : భజన ఆపేసి మంచి సినిమా తీయండి సార్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హరీష్ - పవన్ 'ఉస్తాద్' అప్డేట్ కూడా!


'జైలర్' కంటే ముందు 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం', 'కెజియఫ్' సినిమాల్లో తనకు విలన్ రోల్స్ ఆఫర్ చేసినప్పటికీ... చేయలేదని చెప్పారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్'లో కనుక వినాయకన్ నటించి ఉంటే... తెలుగులో మరింత పాపులర్ అవ్వడమే కాదు, ఆస్కార్ అవార్డు సాధించిన 'నాటు నాటు' పాట ఉన్న సినిమాలో భాగం అయ్యేవారు. 'కెజియఫ్' కూడా జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు మిస్ చేసుకోవడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు మిస్ అయ్యారని చెప్పుకోవాలి.  


Also Read అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial