ఒకప్పుడు తెలంగాణ నేపథ్యం కొన్ని క్యారెక్టర్లకు లేదంటే ఏవో కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యేది. అయితే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లైమ్ లైట్‌లోకి బలంగా వచ్చింది. 'జాతి రత్నాలు', 'డీజే టిల్లు', 'బలగం', లేటెస్టుగా వచ్చిన 'మేమ్ ఫేమస్', 'పరేషాన్' చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కాయి. మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆ కోవలో వస్తున్న సినిమా 'జాగ్రత్త బిడ్డా'. 


టీవీ సీరియల్స్ టు సినిమా!
కృష్ణ మోహన్, ప్రియాంక రెవ్రి, శ్రీకాంత్ కరణం ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'జాగ్రత్త బిడ్డా' (Jagratha Bidda Movie). కె.ఎస్.బి. క్రియేషన్స్, ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థలపై విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం, ఎం.వై. గిరిబాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కృష్ణ మోహన్ దర్శకత్వం వహించారు. టీవీ సీరియల్స్ తీసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే... దర్శకుడిగా వెండితెరపై ఆయనకు తొలి చిత్రమిది. 


'జాగ్రత్త బిడ్డా' కథ ఏంటంటే?
బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా 'జాగ్రత్త బిడ్డా' సినిమా తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు చెప్పారు. కంటికి రెప్పలా, చాలా అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు చెల్లెళ్ళకు తీరని అన్యాయానికి జరిగితే... ఓ అన్నయ్య ఏ విధంగా స్పందించాడు? తప్పు చేసిన వాళ్ళకు ఎటువంటి శిక్ష విధించారు? అనేది సినిమా కథ. 


జూన్ నెలాఖరున విడుదల!
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని నిర్మాతలు శ్రీకాంత్ కరణం, ఎం.వై. గిరిబాబు తెలిపారు. జూన్ (ఈ నెల) 23న సినిమా విడుదల చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఏపీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మినిమం గ్యారంటీ మూవీస్ సంస్థ ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎం అచ్చిబాబు విడుదల చేస్తున్నారు.



సందేశాత్మక చిత్రమిది...
విజయం సాధించాలి! - సీతక్క
'జాగ్రత్త బిడ్డా' ట్రైలర్ విడుదల చేసిన ములుగు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్క... ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ''ఈ మధ్య తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. 'డి.జె. టిల్లు', 'బలగం' చిత్రాల కోవలో 'జాగ్రత్త బిడ్డా' కూడా విజయం సాధించాలి. మంచి సందేశంతో సినిమా రూపొందింది. ఇప్పుడు సమాజానికి ఇటువంటి సినిమాలు చాలా అవసరం'' అని చెప్పారు.


Also Read : 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?
 
'జాగ్రత్త బిడ్డా' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, డి.ఎస్. రావు, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో తీవ్రతరమైన సమస్యను తీసుకుని కథ రెడీ చేసి... పకడ్బందీ కథనంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 


Also Read : భయంకరమైన నెగిటివిటీ ఉన్నా భారీ కలెక్షన్స్ - మొదటి రోజు అదరగొట్టిన 'ఆదిపురుష్'



'జాగ్రత్త బిడ్డ' సినిమాలో కృష్ణ మోహన్, ప్రియాంక రెవ్రి, శ్రీకాంత్ కరణం, ఎం.వై. గిరిబాబు, ఎన్.ఎస్. సత్యం, సాయి రాజ్, వర ప్రసాద్, రాఘవ సతీష్ శర్మ, హీనా రాయ్, రమ్య, మేఘన, శ్రీరంగం శ్రీ రమణి, యశస్విని, 'మిర్చి' మాధవి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి పోరాటాలు : అశోక్ రాజ్, కూర్పు : శివ శర్వాణి, ఛాయాగ్రహణం : పోతన ఓం ప్రకాష్ - మీరా, పాటలు : కిరణ్ ధర్మారపు, స్వరాలు : మల్లిక్ ఎం.వి.కె, నేపథ్య సంగీతం : సందీప్ కుమార్, సహ నిర్మాత: ఎం.వై. గిరిబాబు, నిర్మాత : శ్రీకాంత్ కరణం, కథ - మాటలు - కథనం - దర్శకత్వం : కృష్ణ మోహన్, విడుదల : ఎమ్.జి.ఎమ్. మూవీస్ (ఎం. ఆచ్చిబాబు).