Jagapathi Babu: టాలీవుడ్‌లో ముందు హీరోగా, ఆ తర్వాత విలన్‌గా ఎనలేని గుర్తింపు దక్కించుకున్నారు జగపతి బాబు. అందుకే ఆయన ఫ్యాన్స్ అంతా ఆయనను జగ్గూ భాయ్ అని పిలుస్తుంటారు. ఇటీవల ఈ నటుడు జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కల్చర్ తనకు చాలా నచ్చిందని ఎప్పటికప్పుడు జపాన్ విశేషాలను సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. తాజాగా జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన జగపతి బాబు.. అక్కడి ప్రజల గురించి, కల్చర్ గురించి వివరిస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు.


క్షమాపణలు..


ముందుగా జపాన్ గురించి ఈ వీడియోలో వివరించారు జగపతి బాబు. ‘‘మే 1న జరిగిన ఒక ప్రోగ్రామ్ కోసం జపాన్ వచ్చాను. ప్రోగ్రామ్‌ను త్వరత్వరగా నిర్వహించడం వల్ల వెబ్‌సైట్ క్రాష్ అయిపోయి చాలామంది రాలేకపోయారు. క్రాష్ అయిపోవడం వల్ల ఫేక్ ఏమో అని, ఎలా రావాలా అని చాలా బాధపడ్డారు. దానికి నేను క్షమాపణలు చెప్పాలి. దానికి మేము ఏం చేయలేకపోయాం. కొందరే రాగలిగారు. కచ్చితంగా త్వరలోనే అందరినీ మళ్లీ కలుస్తాను. జపాన్ వెళ్లడం అనేది నా కల. 30 ఏళ్ల నుంచి దానిని చూడాలి అనుకుంటూ ఉన్నాను. జపాన్‌లో తెలుగులో మాట్లాడేవాళ్లని చూసి షాకయ్యాను. వాళ్లందరినీ చూసి చాలా ముచ్చటేసింది. షాపుల్లోకి వెళ్లి ఏమైనా కొన్నా, రెస్టారెంట్స్‌లోకి వెళ్లి ఏమైనా ఆర్డర్ చేసినా పెద్ద సాయం చేసినట్టుగా స్పందిస్తారు’’ అని తెలిపారు.


డిస్టర్బ్ చేయలేదు..


‘‘వాళ్ల క్రమశిక్షణ కూడా చాలా బాగుంటుంది. వీధుల్లో ఎక్కడా చెత్త క్యాన్ కనిపించదు. రోడ్డు మీద ఏం పడేయకూడదు అనేది వాళ్ల రూల్. రోడ్ మీద తిన్నా కూడా ఆ వేస్ట్‌ను ఇంటికి తీసుకెళ్లి పడేయాల్సిందే. అక్కడ ఉన్న మరో మంచి విషయం ఏంటంటే.. ఏది ఎక్కడ మర్చిపోయినా, కావాలని వదిలేసి వెళ్లిపోయినా అది అక్కడే ఉంటుంది. అలాగే నేను ఒకసారి పాస్‌పోర్ట్ మర్చిపోయాను. తరువాతి రోజుకు మళ్లీ నా దగ్గరకు వచ్చేసింది. జపాన్‌లో అందరూ అలా ఎందుకు ఉన్నారంటే వాళ్లు ఉన్నదానితోనే తృప్తిపడతారు అని చెప్పారు. అక్కడ చాలా తిరిగాను, తిన్నాను. అక్కడ నన్ను ఎవరు గుర్తుపడతారులే అని ఫ్రీగా తిరిగాను. కానీ వాళ్లు నన్ను గుర్తుపట్టినా డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నారని తర్వాత తెలిసింది. సెలబ్రిటీ అయినా కూడా ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము మీ దగ్గరకు రాకూడదు అన్నారు’’ అని వారి కల్చర్‌ను ప్రశంసించారు.


ప్రెసిడెంట్ గారు..


‘‘ఆంధ్ర రెస్టారెంట్‌కు వెళ్తే ఒక లేడీ ‘ఆర్ఆర్ఆర్’ టీషర్ట్ వేసుకొని ఉంది. నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి ఫోటో తీసుకుంది. ‘రంగస్థలం’ సినిమా చూశానని చెప్తూ ప్రెసిడెంట్ గారు అని పిలిచింది. 20 ఏళ్ల క్రితం నేను నటించిన ఒక ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడారు. మీటింగ్‌లో ఏ సినిమా గురించి అడిగినా మేము చూశామని చెప్తున్నారు. నా ప్రతీ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. వాళ్ల ఎమోషన్ చూసి నేను షాక్ అయ్యాను. సెల్ఫీ తీసుకోవడానికి రమ్మంటే ఒకరు ఏడ్చేస్తున్నారు, ఇంకొకరు వణికిపోతున్నారు. అదంతా చూస్తుంటే నేను వాళ్ల కుటుంబ సభ్యుడిని అయిపోయాను అనిపించింది. నాలో మీకు ఏం నచ్చింది అంటే.. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. అసలు జపాన్‌కు నేను వెళ్లిన ఉద్దేశ్యం వేరు. కానీ అక్కడ జరిగింది వేరు’’ అంటూ జపాన్ గురించి చాలా చక్కగా వివరించారు జగ్గూ భాయ్.






Also Read: నన్ను వాళ్లు మోసం చేశారు, వారి ట్రాప్‌లో పడకండి.. జాగ్రత్త - జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌