యావత్ సినీ ప్రేక్షకుల, అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదిపురుష్' ఈరోజు (జూన్16) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో మోషన్ క్యాప్చర్ 3d టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్ గా రూపొందించిన ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే విడుదలై 24 గంటలు గడవకముందే ఆదిపురుష్ మూవీ ఓ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.


ఈ సినిమా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందని, హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూ సేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆదిపురుష్ చిత్రం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా రామాయణాన్ని అలాగే శ్రీరాముడిని, భారతీయ సాంప్రదాయాన్ని ఎగతాళి చేసినట్లుగా ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో అలాగే తులసీదాస్ రచించిన రామచరిత మానస్ లోనూ ప్రధాన పాత్రలను వర్ణించిన విధానానికి అలాగే ఆదిపురుష్ చిత్రంలో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని హిందూ సేన తాజా పిటిషన్ లో ప్రస్తావించింది.


వీటితోపాటు హిందూ దేవుళ్ళైన రాముడు, సీతా, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతర సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సరిదిద్దడానికి చిత్ర యూనిట్ కి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ విష్ణు గుప్తా కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ పాత్ర దారి పాత్ర ను గడ్డం తో క్రూరుడిగా చూపించారని హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి దీనిపై ఆదిపురుష్ చిత్ర ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.


కాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనబరిచింది. సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ తేలిపోయినట్లు ఉన్నాయని, వీఎఫ్ఎక్స్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఈ సినిమా నేపాల్ లో పలు చిక్కులను ఎదుర్కొంది.'ఆదిపురుష్' సినిమాలో సీతా మాత భారత్ లో జన్మించినట్లు ఓ డైలాగ్ ఉంది. కానీ చరిత్ర ప్రకారం సీత మాత నేపాల్ లో జన్మించారని, కాబట్టి సినిమాలో ఆ డైలాగ్ తీసివేయకపోతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వమంటూ నేపాల్ సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక ఈ డైలాగుని సినిమాలో పెట్టడంపై పలువురు నేపాల్ నేతలు కూడా మండిపడుతున్నారు. దీంతో అక్కడ శుక్రవారం ఉదయం మార్నింగ్ షోలను సైతం రద్దు చేశారు.


Also Read: 'RRR' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'ఆదిపురుష్' - ఎందులోనో తెలుసా?