సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి 'SSMB 29' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అడ్వంచర్ మూవీ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. హాలీవుడ్ రేంజ్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్న ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో మహేశ్ తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున కూడా నటించనున్నారట. 


పాన్ ఇండియా సినిమాకి సరైన అర్థం చెప్పిన రాజమౌళి.. తాను తెరకెక్కించే ప్రతీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. ఎంత భారీ బడ్జెట్ తో సినిమా తీస్తారో, అంతే రేంజ్ లో మార్కెటింగ్ చేయడంలో ఆయన దిట్ట అనడంలో సందేహం లేదు. తెలుగులోనే సినిమా రూపొందిస్తున్నప్పటికీ, అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడేలా ప్లానింగ్ చేస్తుంటారు. దీని కోసం స్టార్ క్యాస్టింగ్ ను తన ప్రాజెక్ట్ లో భాగం చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలోనూ అదే పాటిస్తున్నారని, ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ను తీసుకునే ఆలోచన చేస్తున్నారని ఓ రూమర్ ఫిలిం సర్కిల్స్ లో బాగా గట్టిగా వినిపిస్తోంది.


నాగ్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు కానీ, ఆయన 90స్ లోనే బాలీవుడ్ లో క్రేజీ హీరో. ఒకరకంగా 'ఫస్ట్ పాన్ ఇండియా హీరో' అనొచ్చు. అప్పట్లోనే స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీస్ చేసారు. 'మేరీ జంగ్' ( మాస్), 'డాన్ నెం. 1' 'కింగ్' లాంటి హిందీ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు సినిమాలను నార్త్ ఆడియన్స్ కు పరిచయం చేసారు. చాలా గ్యాప్ తర్వాత హిందీలో 'బ్రహ్మాస్త్ర' మూవీ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉన్న నాగార్జునను SSMB 29 లోకి తీసుకోవాలని జక్కన్న అనుకుంటున్నారట. 


Also Read: గోపీచంద్‌కు పోటీగా ఆనంద్ దేవరకొండ - 'గం గం గణేశా' రిలీజ్ డేట్ ఫిక్స్?


రాజమౌళి ఫ్యామిలీతో నాగ్ కు మంచి బాండింగ్ ఉంది. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజన్న' సినిమాలో యాక్షన్ పార్ట్ ను రాజమౌళి డైరెక్ట్ చేసారు. ఎన్నో సినిమాలకు సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణితో నాగార్జునకు ఎన్నో ఏళ్ళ ఫ్రెండ్ షిప్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు SSMB 29 నిర్మాత కెఎల్ నారాయణతోనూ ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణంలో నాగ్ చాలా సినిమాలు చేసారు. వీటన్నిటికి మించి ఘట్టమనేని ఫ్యామిలీతో అక్కినేని హీరోలకు మంచి అనుబంధం ఉంది. దివంగత కృష్ణతో కలిసి 'వారసుడు' 'రాముడొచ్చాడు' లాంటి సినిమాల్లో నటించారు నాగార్జున. అలానే మహేశ్ బాబు - నాగ్ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 


మహేశ్‌ బాబు - నాగార్జున స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని కోరుకుంటున్నారనే విషయాన్ని ఇద్దరూ 'ది ఘోస్ట్' ట్రైలర్ లాంచ్ సమయంలో బయటపెట్టారు. ''29 ఏళ్ల కిందట మీ నాన్న కృష్ణ గారితో కలిసి నటించాను. ఇప్పుడు మనం కలిసి ఓ సినిమా ఎందుకు చేయకూడదు?’’ అని నాగార్జున ట్వీట్ చేయగా.. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన మహేష్ ''ఆ సమయం రావాలని ఆశిద్దాం’’ అని సమాధానమిచ్చారు. ఇవన్నీ చూసుకుంటే రాజమౌళి సినిమాలో 'కింగ్'ను తీసుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని టాక్ వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే అక్కినేని - ఘట్టమనేని ఫ్యాన్స్ ఖుషీ అయినట్లే. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కాంబోలో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. మరి త్వరలోనే మహేశ్‌ - నాగ్ మల్టీస్టారర్ పై దర్శకుడు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 


ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమా తన కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ అవుతుందని రాజమౌళి తెలిపారు. 'ఇండియానా జోన్స్' తరహాలో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని హింట్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కనుంది. రాజమౌళి గత చిత్రాలకు వర్క్ చేసిన టీమ్ తో పాటుగా పలువురు హాలీవుడు ప్రముఖులు ఈ ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారు. ఇటీవలే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయినట్లు రచయితా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ క్రేజీ చిత్రాన్ని ఉగాదికి అధికారికంగా ప్రకటించి, సమ్మర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. 


Also Read: రాజమౌళి, ప్రభాస్ సినిమాల తర్వాత ఆ ఘనత సాధించింది 'హనుమాన్' మాత్రమే.. ఇది కదా ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటే..!