Hanuman Records: 'హను-మాన్'.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టిస్తోంది. తక్కువ అంచనాలతో వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక చిన్న హీరో సినిమాకి మూడో వారంలోనూ జనాలు బ్రహ్మరథం పడుతున్నారంటే, అది ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. లాభాల పరంగా చూస్తే, ఇది కనీవినీ ఎరుగని ప్రభంజనం అని చెప్పాలి. అయితే ఇప్పుడు ‘హనుమాన్’ మూవీ కొన్ని అరుదైన రికార్డ్స్ సాధించి, ఏకంగా ఎస్.ఎస్ రాజమౌళి - ప్రభాస్ సినిమాల సరసన చోటు సంపాదించుకుంది.


'హను-మాన్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 275 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. నైజాం, ఏపీ, నార్త్, ఓవర్ సీస్ లలో రూ.50 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇలా నాలుగు వేర్వేరు ప్రాంతాలలో రూ.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు 4 నాలుగు తెలుగు చిత్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. 'బాహుబలి 1', 'బాహుబలి 2', RRR, 'సలార్' సినిమాలు నార్త్, ఓవర్సీస్, ఏపీ, నైజాం ఏరియాల్లో యాభై కోట్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు ఐదో సినిమాగా ‘హనుమాన్’ వచ్చి చేరింది.


Also Read: తెలుగు మూవీస్ ఓవర్సీస్ రైట్స్ - 'దేవర', 'విశ్వంభర' ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయంటే?


ఓవర్సీస్‌లో ₹50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే.. 'బాహుబలి 1' (2015), 'బాహుబలి 2' (2017), 'సాహో' (2019), RRR (2022), 'సలార్' (2023) చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో 'హనుమాన్' మూవీ కూడా జాయిన్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలిపి వరుసగా 20 రోజుల పాటు రూ.1 కోటికి పైగా షేర్ రాబట్టిన సినిమాగా 'హను-మాన్' మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి-2 (వరుసగా 28 రోజులు), బాహుబలి (20 రోజులు) చిత్రాలు మాత్రమే దీని కంటే ముందున్నాయి. 


కాగా, 'హను-మాన్' ఫస్ట్ తెలుగు సూపర్ హీరో మూవీ. దీనికి పురాణాల నేపథ్యం జోడించి తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇందులో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గౌరహరి సంగీతం సమకూర్చగా, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 


ఇకపోతే 'హనుమాన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. మార్చి మొదటి లేదా రెండో వారంలో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: RC16 టాలెంట్ హంట్ - రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్!