Gam Gam Ganesha Release Date: 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ నటిస్తోన్న చిత్రం 'గం గం గణేశా'. నూతన దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


'గం గం గణేశా' చిత్రాన్ని మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2024 మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడో రేపో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి, వెంటనే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆనంద్ దేవరకొండ మంచి ఫెస్టివల్ సీజన్ ను ఎంచుకున్నప్పటికీ సోలో రిలీజ్ డేట్ దొరకడం లేదు. పోటీగా 'భీమా'తో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదల ప్లాన్ చేసుకున్నాయి.


గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' సినిమాని శివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటివలే అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్. గోపీచంద్ పోలీసాఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మ్యాచో స్టార్, తనకు కలిసొచ్చిన ఖాకీ డ్రెస్ హిట్ ఇస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు సినిమాతో 'గం గం గణేశా' పోటీగా రాబోతోంది.


Also Read: RC16 టాలెంట్ హంట్ - రామ్ చరణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్!


నిజానికి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని, మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ కా దాస్ సినిమా చెప్పిన సమయానికి రాకపోయినా, 'భీమా'తో 'గం గం గణేశా' చిత్రానికి పోటీ తప్పదు. అలానే ఫెస్టివల్ వీకెండ్ కాబట్టి వీటితో పాటుగా మరికొన్ని చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అవుతాయి. మరి వీటిల్లో ఏ మూవీ హిట్ అవుతుందో చూడాలి.


రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. గతేడాది 'బేబీ' సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'గం గం గణేశా' చిత్రంతో మరో హిట్ కొట్టి తన మార్కెట్ ను సుస్థిర పరుచుకోవాలని చూస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. 


'గం గం గణేశా' చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ యావర్, వెన్నెల కిషోర్, కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మానుయేల్, నయన్ సారిక, ఇమ్మానుయేల్, రాజ్‌ అర్జున్, సత్యం రాజేశ్ తదితరులు నటించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read: రాజమౌళి, ప్రభాస్ సినిమాల తర్వాత ఆ ఘనత సాధించింది 'హనుమాన్' మాత్రమే.. ఇది కదా ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటే..!