Allu Arjun Comments In Pushpa 2 Thanks Meet: 'పుష్ప 2' (Pushpa 2) సినిమా విజయాన్ని అభిమానులకు అంకితమిస్తున్నానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. 'పుష్ప 3' ఓ అద్భుతమైన ఎనర్జీలా ఉంటుందని.. అదెప్పుడూ కార్యరూపం దాలుస్తుందో చూడాలని చెప్పారు. పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో పాల్గొన్న బన్నీ దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసలు కురిపించారు. సుకుమార్ వల్లే 'పుష్ప' కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని అన్నారు. సినిమా కోసం కష్టపడ్డ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 'ఒక సినిమాకు అందరూ బాగా పని చెయ్యొచ్చు. కానీ, హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడ్డా దర్శకుడు సరిగ్గా పని చేయకుంటే సినిమా విజయం సాధించదు. అలాగే, నటీనటులు సరిగ్గా చేయకున్నా దర్శకత్వం బాగుంటే సినిమా కచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పని చేసినా మనం థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్‌కే.


ఒక సినిమాలో పాటలు, డ్యాన్స్, ఫైట్, పాటలు ఏది బాగున్నా దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే వచ్చింది. నేను బాగా నటించానంటే దానికి కారణం సుకుమార్. ఎంత గొప్ప స్టార్ అయినా కూడా సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు. నన్ను గైడ్ చేసినందుకు థ్యాంక్స్. ఆయన కలల నుంచి పుట్టిన పాత్రలమే మేమంతా. తెలుగు సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని చూసి గర్వపడుతోంది. సుకుమార్ పర్సన్ కాదు.. ఓ ఎమోషన్. కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమా షూట్ చేశాం. మా అందరి జీవితాలను అర్థవంతం చేసినందుకు సుకుమార్‌కు ధన్యవాదాలు. ఐదేళ్ల షూటింగ్ అసలు ఈ సినిమా అవుతుందా.? అని అనిపించింది. నా ఆర్మీని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.' అని బన్నీ పేర్కొన్నారు.


Also Read: చిరంజీవి ‘బిగ్ బాస్’, పవన్ ‘సుస్వాగతం’ to కార్తీ ‘సత్యం సుందరం’, అనుష్క ‘వేదం’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్


బాలీవుడ్‌పై బన్నీ కామెంట్స్ వైరల్


పుష్ప 2 వస్తోందని హిందీ సినిమా విడుదల తేదీని కూడా మార్చుకుందని.. ప్రతీ ఇండస్ట్రీ చూపిస్తోన్న ప్రేమకు బన్నీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 'బాలీవుడ్'పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని.. హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని అన్నారు. వెంటనే పక్కన ఉన్న నిర్మాత రవిశంకర్ అప్రమత్తమయ్యారు. 'బాలీవుడ్' వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని చెవిలో చెప్పగా.. తనకు ఆ పదం మాత్రమే నచ్చదని క్లారిటీ ఇచ్చారు. 


'పుష్ప 3 సినిమా ఓ మిరాకిల్'


'పుష్ప 3' సినిమా ఓ అద్భుతమని.. అదేంటో నాకు, సుకుమార్‌కు కూడా తెలియదని బన్నీ అన్నారు. 'మైత్రీ మూవీ మేకర్స్ లేకుండా ఇలాంటి సినిమా తీయడం సాధ్యం కాదు. దేవిశ్రీ మ్యూజిక్ అద్భుతం. సాంగ్స్‌కు బిలియన్స్ వ్యూస్ వచ్చాయి. 'పుష్ప' ఉన్న ప్రతీ చోటా రష్మిక ఉంటుంది. అలాగే పహాద్ ఫాజిల్ ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. చాలామంది కొరియాగ్రాఫర్లు హీరోలకు స్టెప్పులు నేర్పుతారు. కానీ, గణేష్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు. నవకాంత్ చేసిన క్లైమాక్స్ ఫైట్ దాదాపు 18 - 20 రోజులు తీసినా నాకు చిన్న గీత కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం.' అని అల్లు అర్జున్ తెలిపారు.


కాగా, ఇప్పటికీ 'పుష్ప' పూర్తి కథ చెప్పలేదని.. ఇది సెకండ్ ఇంటర్వెల్ అని దర్శకుడు సుకుమార్ (Sukumar) అన్నారు. పుష్ప 3, 4 ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేనని చెప్పారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.


Also Read: 'అఖండ 2' కోసం సరైనోడిని దించిన బోయపాటి శ్రీను... బాలకృష్ణ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో