యువ కథానాయకుడు నితిన్ (Nithiin) నటించిన లేటెస్ట్ కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'మాచర్ల నియోజకవర్గం' (Macherla Niyojakavargam) తో ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ అలియాస్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా విషయాలతో వార్తల్లో ఉండాల్సిన ఆయన... విడుదలకు కొన్ని రోజుల ముందు వివాదాలతో వార్తల్లో నిలిచారు.
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో కమ్మ, కాపు కులాలపై ఎస్ఆర్ శేఖర్ గతంలో ట్వీట్లు చేశారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫోటోషాప్ చేసి తాను ట్వీట్లు చేసినట్టు ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఎస్ఆర్ శేఖర్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఇప్పుడు మరో సారి ఆ వివాదంపై ఆయన స్పందించారు.
 
నా నోట్లో వేళ్ళు లాగకూడదు : ఎస్ఆర్ శేఖర్  
''వాళ్ళ ఫ్యామిలీలో ఐదు వేళ్ళు ఇంట్లో వెళ్ళడానికి... నా ఫ్యామిలీలో నోట్లోకి వెళ్ళే ఐదు వేళ్ళు తీయకూడదు'' అని ఎస్ఆర్ శేఖర్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. కుల వ్యాఖ్యల వివాదం రెచ్చగొట్టి తన కడుపు మీద కొట్టారనే ఫీలింగ్ ఆయనలో ఉందని ఈ మాటలు చూస్తే తెలుస్తోంది.
 
ఫేక్ స్క్రీన్ షాట్స్ ఎవరు సర్క్యులేట్ చేశారో తనకు తెలియదని 'మాచర్ల నియోజకవర్గం' దర్శకుడు ఎస్ఆర్ శేఖర్ తెలిపారు. అనుకోకుండా వివాదంలో చిక్కుకోవడంతో... ఈ ఇష్యూ గురించి ఆయన మాట్లాడుతూ ''పదిహేనేళ్ళు కష్టపడి, రెండేళ్ళు స్క్రిప్ట్ రాసుకుని, ప్రతి రోజూ మూడు నాలుగు వందల మందితో వంద రోజులు సినిమా తీసి, అరవై నిద్రలేని రాత్రులు గడిపి... ఒక సినిమాను జనంలోకి తీసుకు వెళ్ళడం కష్టం అండీ! అటువంటి సమయంలో ఇటువంటి వివాదాలు ఫస్ట్ టైమ్ దర్శకుడికి రాకూడదు. అది ఎవరు చేశారో? ఎందుకు చేశారో? నాకు తెలియదు'' అని అన్నారు.


Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు
 
నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా
ఎడిటర్‌గా తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేశానని ఎస్ఆర్ శేఖర్ తెలిపారు. వ్యక్తిగతంగా తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టమని, మహేష్ ఫ్యాన్ గనుక ఆయన సినిమాలు మాత్రమే చేస్తానంటే ఇండస్ట్రీలో ఉండలేనని ఆయన అన్నారు. ''అభిమానం వేరు, ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎవరికీ ఎలాంటిది ఉండదు. నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు'' అని ఆయన స్పష్టం చేశారు. తనది కులాంతర వివాహమని తెలిపారు. అంతకంటే ఏమీ చెప్పలేనని అన్నారు.


Also Read : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?


రెండు నిమిషాల పనికి 20 ఏళ్ళ జీవితం పోతోంది!
ఎవరు ఏ ప్రయోజనం కోసం ఫేక్ ట్వీట్స్ సర్క్యులేట్ చేశారో తెలియదు కానీ... వాళ్ళు చేసిన రెండు నిమిషాల పనికి 20 ఇయర్స్ లైఫ్ పోతోందని ఎస్ఆర్ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ సంతోషం కోసం తన కెరీర్ ఏంటో తెలియని స్టేజికి తీసుకు రాకూడదని ఆయన అన్నారు. తాను సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి వంద ట్వీట్లు చేసి ఉంటానని, తాను మూడు నాలుగు వేల ట్వీట్లు చేసి ఉంటే అందులో మహేష్ బాబు గారి సినిమాలపై చేసిన ట్వీట్లు పదిహేను వందలు, రెండు వేలు ఉంటాయని వివరించారు.     


Also Read : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి