''నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నా అభిమానాన్ని వ్యక్తం చేశాను తప్ప వేరే కులానికి చెందిన వారిని తిట్టలేదు'' ఎస్ఆర్ శేఖర్ ఒక ట్వీట్ చేశారు. ఆయన ఇలా ట్వీట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది.


నితిన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'తో ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెగా ఫోన్ పట్టడానికి ముందు పలు చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పని చేశారు. ఎస్ఆర్ శేఖర్ అసలు పేరు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనకు కులాభిమానం ఎక్కువ అని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా... తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎస్ఆర్ శేఖర్ పలు పోస్టులు చేసినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయన కమ్మ, కాపు ప్రజలను రాయలేని భాషలో తిట్టినట్టు ఒక స్క్రీన్ షాట్ ఉంది. తనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఎస్ఆర్ శేఖర్ స్పందించారు.


''ఈ స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ ఫేక్. ఎవరో కావాలని ఎడిట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి నమ్మకండి ఈ కింద ఉన్న స్క్రీన్ షాట్ లో ఉన్న పేరు డిఫరెంట్. ఫోటోషాప్ చేసిన వాడు ఎవడో సరిగా చేయలేదు. నేను స్వతహాగా వైఎస్సార్ అభిమానిని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నా అభిమానాన్ని వ్యక్తం చేశాను తప్ప వేరే క్యాస్ట్ వాళ్ళని అబ్యూస్ చేయలేదు. నేను ఒక్క ట్వీట్ కూడా డిలీట్ చేయలేదు, చెయ్యను కూడా!'' అని ఎస్ఆర్ శేఖర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.






ఈ వివాదంపై నితిన్ కూడా స్పందించారు. ''ఎవరో ఫేక్ పర్సన్ క్రియేట్ చేసిన ఫేక్ ట్వీట్ అనవసరపు రాద్ధాంతం సృష్టించింది. ఇతరుల మనోభావాలను దెబ్బ తీసింది. ఇది ఎంతో బాధగా ఉంది. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను'' అని నితిన్ ట్వీట్ చేశారు.





'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయకగా నటించారు. ప్రత్యేక గీతల్లో అంజలి సందడి చేశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ముందు దర్శకుడిపై ఎవరో కావాలని నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం భావిస్తోందని సమాచారం.


Also Read : ఈ బామ్మగారు బాలయ్య ఫ్యాన్, విజిలేసి మరీ జైకొట్టింది - వీడియో వైరల్


రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, డైలాగ్స్: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అరసు.


Also Read : మహేష్ బాబు సినిమాలో సంయుక్త - క్లారిటీ ఇచ్చిన హీరోయిన్